విశాఖ గ్యాస్ లీక్..మేం చచ్చిపోవాలా ? మంత్రులూ..వెంకటాపురంలో పడుకొండి

‘మేం చచ్చిపోవాలా ? తిండి తినడానికి ఏమీ లేదు ఎలా బతకాలి..ఇంట్లో ఉంటే..కళ్ల మంటలు..శరీరంపై దురదలు..వాంతులు అవుతున్నాయి. చిన్న పిల్లల పరిస్థితి ఛెప్పనవసరం లేదు. కళ్లు తిరిగి కింద పడిపోతున్నాం. తమను ఆదుకొనేది ఎవరు ? ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు బస చేయండి..అప్పుడు వాస్తవం ఏంటో మీకు తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలు ఏం చేసుకోవాలి’ ? అంటూ ప్రశ్నిస్తున్నారు పాలిమర్స్ ప్రభావిత ప్రాంత ప్రజలు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసర గ్రామాల్లో ఇంకా భయాందోళనలు పోవడం లేదు. వెంకటాపురంలో అధిక ప్రభావం ఉంది. మృతులు, క్షతగాత్రులు ఎక్కువగా ఉండే..ఈ గ్రామంలో కాకుండా.. మంత్రులు వేరే ప్రాంతంలో బస చేస్తారా ? అంటూ నిలదీస్తున్నారు. గ్యాస్ లీకేజ్ అయిన..ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో వెంకటాపురం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ గ్రామంలో స్టైరిన్ వాసన ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీళ్ల పర్యంతం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గాలి పీల్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా..ముందే తెచ్చుకున్న నిత్యావసర సరుకుల్లో మొత్తం వాసన వస్తోందని తెలిపారు. దీంతో వాటన్నింటినీ బయట పారపోసామంటున్నారు.
ఉదయం నుంచి ఫ్యాన్లు ఆఫ్ చేసినా..వాసన తగ్గడం లేదు. స్టైరిన్ వాసనకు స్థానికులకు కళ్ల మంటలు, వాంతులు చేసుకుంటున్నారు. పగటి పూట ఇళ్లు శుభ్రం చేసుకుని..సాయంత్రానికి బంధువుల ఇంటికి వెళుతున్నారు. గ్యాస్ ప్రభావితం లేని పద్మనాభపురం, బీసీ కాలనీ ప్రాంతాల్లో మంత్రులు బస చేసి వెళ్లిపోయారని చెబుతున్నారు. మంత్రులు ఇక్కడ బస చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం గ్రామ ప్రజలు చేస్తున్న విమర్శలపై మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.