విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందని ప్రచారం.. ఖండించిన VMRDA

Vizag: ఫ్లోటింగ్ బ్రిడ్జి కొట్టుకుపోయిందని వస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వీఎంఆర్డీఏ అధికారి రవీంద్ర చెప్పారు.

విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందని ప్రచారం.. ఖండించిన VMRDA

Updated On : February 26, 2024 / 11:58 PM IST

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రూ.1.60 కోట్లతో ఏపీ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందంటూ ప్రచారం జరుగుతుండడంతో ఈ వార్తలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఖండించింది.

ఫ్లోటింగ్ బ్రిడ్జి కొట్టుకుపోయిందని వస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వీఎంఆర్డీఏ అధికారి రవీంద్ర చెప్పారు. వైజాగ్ ఆర్కే బీచ్ లో నిర్వహణ పరంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి టీ జంక్షన్ జాయింట్ ను సిబ్బంది తొలగించారని తెలిపారు.

ఇవాళ కెరటాల ఉధృతి అధికంగా ఉందని, ఇటువంటి సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి టీ జంక్షన్ ను తొలగిస్తామని వివరించారు. అధిక వేగంగా అలలు వచ్చేటప్పుడు ఈ తరహాలో తొలగింపు చేయకుంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందన్నారు.

కెరటాల ఉధృతి తగ్గిన వెంటనే టి జంక్షన్ ఫిక్స్ చేస్తామని అన్నారు. ఎప్పుడైనా అలల ఉధృతి అధికంగా ఉంటే జాయింట్ ను తొలగిస్తామని చెప్పారు. నిర్వహణ పరమైన మార్పుపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కాగా, ఏపీలో పర్యటక కేంద్రంగా విశాఖ నగరం విరాజిల్లుతోంది. సముద్ర తీరంలో అలలపై తేలియాడుతూ ఈ బ్రిడ్జి అందరినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు.

Kolusu Parthasarathy : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. అందుకేనట..