పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్‌ఐఏతో కలిసి విచారించనున్న పోలీసులు
ఉగ్ర కుట్రదారులు సిరాజ్, సమీర్ లను ఐదు రోజులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో కలిసి పోలీసులు విచారించనున్నారు.

Police Investigation
Vizianagaram Terror Case: విజయనగరంలో నమోదైన ఉగ్రకుట్ర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ బోయిగూడ వాసి సమీర్ ను కూడా అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండు విధించారు. ప్రస్తుతం ఇద్దరూ విశాఖ జైలులో ఉన్నారు. అయితే, వారిద్దరిని ఐదు రోజులు పోలీసు కస్టడీకి విజయనగరం కోర్టు అనుమతించింది. విశాఖ సెంట్రల్ జైలు నుంచి పోలీసులు వారిద్దరిని విజయనగరానికి తీసుకురానున్నారు.
ఉగ్ర కుట్రదారులు సిరాజ్, సమీర్ లను ఐదు రోజులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో కలిసి పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏకి చెందిన ఉన్నత స్థాయి విచారణ బృందం విజయనగరానికి చేరుకొని, ఆ జిల్లా పోలీసుల నుంచి వివరాలు సేకరించింది. విచారణ నేపథ్యంలో కోర్టు, టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే డీసీసీ బ్యాంక్‌లోని సిరాజ్ లాకర్ లో రూ.45లక్షల నగదును పోలీసులు గుర్తించారు.
అయితే, డీసీసీ బ్యాంక్‌లో సిరాజ్‌కు చెందిన లాకర్‌ను తెరిచేందుకు అతని తండ్రి విఫలయత్నం చేసినట్టు సమాచారం. అప్పటికే ఆ ఖాతాను సీజ్ చేసినందున లాకర్‌ను తెరవడం కుదరదని బ్యాంక్ అధికారులు చెప్పినట్టు తెలిసింది. దీంతో సిరాజ్ తండ్రి, కుటుంబసభ్యులతోపాటు సమీర్ కుటుంబసభ్యుల కదలికలపై మరింత నిఘా పెంచాయి. సిరాజ్ దగ్గర డబ్బులతో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పేలుళ్ల కుట్ర కోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి.. సున్నిత మనస్కులను తమ భావజాలానికి ఆకర్షితులుగా సౌదీ హ్యాండ్లర్లు చేస్తున్నారు. మ్యాజిక్ లాంతర్ అనే కొత్త పంథా ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, టెలీగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ ద్వారా పోస్టులు పెడుతూ.. వీటికి స్పందించి అనుకూలంగా పోస్టులు పెట్టిన వారిని సౌదీ హ్యాండ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. దీనికితోడు ప్రతినిత్యం వారి సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా పెడుతూ.. వారిని తమవైపు అనుకూలంగా మలుచుకునే పోస్టులు పెడుతున్నారు.
సంస్థ సానుభూతిపరులతో పరిచయం చేయించి సమావేశాలు ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన నిధులు సమకూర్చడం చేస్తున్నారు. వీరిని ఎప్పటికప్పుడు సౌదీ హ్యాండ్లర్లు ఆపరేటింగ్ చేస్తున్నారు. అలా సౌదీ హ్యాండ్లర్ల కు సమీర్, సిరాజ్ చిక్కినట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులుగా వారిద్దరూ మారినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు ఈ కేసుకు సంబంధించి తాజాగా విచారణలో మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీర్, సిరాజ్ ఐదు రోజుల పోలీస్ కస్టడీలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.