Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిథిలో అపశ్రుతి.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ..

Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిథిలో అపశ్రుతి.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

Simhachalam

Updated On : April 30, 2025 / 12:47 PM IST

Simhachalam: విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో మంగళవారం అర్థరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున సమయంలో అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ క్లాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ క్యూలైన్ ప్రాంతంలో సిమెంట్ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Telangana SSC Results 2025

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు చికిత్స నిమిత్తం తరలించారు. హోమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో 10కిపైగా అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. సహాయక చర్యలు హోమంత్రి అనిత, కలెక్టర్, సీపీ పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరారు. బుధవారం తెల్లవారు జామున 3గంటల నుంచి దర్శనం కల్పించడంతో క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురడంతో ఒక్కసారిగా గోడ కూలి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. సహాయకచర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.