రుషికొండకు పవన్ వెళ్లొచ్చింది అందుకేనా? మరి నెక్ట్స్ ఏంటి?

పవన్ వచ్చి వెళ్లారు.. సీఎం చంద్రబాబు రాక కోసం రుషికొండ ఎదురుచూస్తోంది. ఆయన వస్తే తప్ప.. బిల్డింగ్‌లను ఏం చేయాలన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

రుషికొండకు పవన్ వెళ్లొచ్చింది అందుకేనా? మరి నెక్ట్స్ ఏంటి?

Pawan Kalyan

Updated On : October 22, 2024 / 7:52 PM IST

జిల్‌జిగేల్‌మను బిల్డింగ్‌లు.. దమ్మిడి ఉపయోగం లేనప్పుడు.. ఎన్ని వెలుగులు ఉంటే ఏం లాభం? దీంతో ఏం చేయాలో తెలియక.. ఎలా చేయాలో అర్థం కాక.. ఏపీ సర్కార్‌ తలలు పట్టుకుంటోంది. చాయిస్‌ మీదే అంటూ జనాలకు ఓ చాన్స్ ఇచ్చేశారు. ఇదీ రుషికొండ ప్యాలెస్‌ పరిస్థితి. వదల్లేరు.. వదలకూడదు.. మరి నెక్ట్స్ ఏంటి.. 5వందల కోట్ల రూపాయలతో నిర్మించిన రుషికొండ బిల్డింగ్‌ను ఎలా వాడాలి.. ముందున్న ఆప్షన్లు ఏంటి?

ఏపీ అంతా ఆసక్తిగా చూస్తోంది ఈ బిల్డింగ్‌ల వైపే! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వచ్చి పరిశీలించిన తర్వాత.. ఈ ప్యాలెస్‌ గురించే మాట్లాడుకుంటోంది రాష్ట్రమంతా ! 5వందల కోట్లతో గత వైసీపీ సర్కార్‌.. రుషికొండలో విలాసవంతంగా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని అతిథి గృహాల కోసం కట్టామన్నది ఫ్యాన్‌ పా్రటీ మాట. జగన్ కుటుంబం కోసమే ఈ నిర్మాణాలు అని టీడీపీ ఆరోపణ. ఎవరి వాదన ఏంటనేది ఎలా ఉన్నా.. వైసీపీ ఓడిపోయింది.

కూటమి అధికారంలోకి వచ్చింది. మరి దీన్ని ఎలా వాడుతారన్నదే ఇప్పుడు అతిపెద్ద టాస్క్. వైసీపీ హయాంలో రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలిచేందుకు వచ్చినప్పుడు పవన్‌ను అడ్డుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అదే ప్రాంతంలో పర్యటించారు. కార్మికులతో కాసేపు ముచ్చటించారు. ప్యాలెస్ లోపలికి అయితే వెళ్లలేదు. బయటి నుంచే భవనాలను పరిశీలించారు. దీంతో ఇప్పుడు ఆ బిల్డింగ్‌లను ఏం చేస్తారన్నది ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

జనాలకు చాయిస్
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దామో చెప్పాలంటూ జనాలకు చాయిస్ ఇచ్చేశారు మంత్రి లోకేశ్‌. దీని వెనక పెద్ద కారణమే ఉంది. అంటే ఒక్కటి మాత్రం క్లియర్‌.. రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దాన్ని ఎలా వాడుకోవాలన్నది పెద్ద సమస్యగా మారింది. ఈ భవనానికి నిర్వహణ ఖర్చులు భారంగా మారిపోతున్నాయ్.

ఈ లగ్జరీ బిల్డింగ్‌లను సరిగ్గా నిర్వహించకపోతే.. ఎటూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో వీలైనంత త్వరగా.. వీటిని ఉపయోగించుకోవాలని సర్కార్ భావిస్తోంది. వీటిని డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇవ్వాలని మొదట్లో ప్రతిపాదన వచ్చింది. హోటల్ చేయాలని కొందరు.. సినీ పరిశ్రమకు ఇవ్వాలని మరికొందరు సూచనలు చేశారు. ఐటీ సంస్థలకు కేటాయిస్తే బెటర్‌ అనే ఆలోచన కూడా వినిపించింది. ఐతే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

రుషికొండ భవనాల నిర్వహణే రాష్ట్ర సర్కార్‌కు భారంగా మారింది. వీటిని వినియోగిస్తే విద్యుత్‌ బిల్లులే నెలకు 25 లక్షల వరకు వస్తాయ్‌. వీటికి ఇతర నిర్వహణ ఖర్చులు అదనం. 2023 నవంబర్‌ నుంచి రుషికొండ ప్యాలెస్‌కు విద్యుత్‌ ఉపయోగిస్తున్నారు. అప్పటినుంచి నెలకు సగటున 7లక్షల కరెంట్‌ బిల్లు వస్తోంది. ఐతే బకాయిలు చెల్లించక పోవడంతో.. ఇప్పటివరకు 85 లక్షల వరకు బిల్లులు పేరుకుపోయాయ్‌. ఈ మొత్తాన్ని భరించగల ఆర్థిక స్తోమత కలిగిన సంస్థకు మాత్రమే అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో రుషికొండ ప్యాలెస్‌ వ్యవహారంపై కూటమి సర్కార్‌ తర్జనభర్జన పడుతోంది. ఏదైనా స్టార్ హోటల్‌కు, రిసార్టుకు లీజుకు ఇస్తే ఆదాయమైనా వస్తుందనుకున్నారంతా ! ఈ ప్యాలెస్ నిర్మించేందుకు రిసార్టులు కూల్చేశారు. ఐతే ఆ రిసార్టుల వల్ల ఏడాదికి 25కోట్లకుపైగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు దాన్ని కూల్చి.. ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన నిర్మాణంతో అంతైనా ఆదాయం వస్తుందో రాదో తెలియని పరిస్థితి.

వైజాగ్‌లో ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలకు సంబంధించి.. భారీ కార్పొరేట్‌ మీటింగ్స్ జరుగుతుంటాయ్. వాటికి ఈ భవనాలు ఉపయోగించుకుంటే బాగుంటుందని విశాఖకు చెందిన పారిశ్రామికవేత్తలు.. మంత్రి లోకేశ్‌కు సూచించారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఐతే అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఇక రాష్ట్రంలో వీసా ఫెసిలిటేషన్‌ సర్వీస్‌ సెంటర్‌ లేదు. హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోంది. రుషికొండలోని ఐదు భవనాల్లో ఒక దానిని ఇందుకోసం కేటాయిస్తే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు.

ఎవరి సూచనలు వారివి
పెట్టుబడుల కోసం పనిచేస్తున్న ఏపీ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డును కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని మరికొందరి అభిప్రాయం. అటు వేసవిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ అనువుగా ఉంటుందని.. 26జిల్లాల ప్రజా ప్రతినిధులు విశాఖపట్నం చూసినట్టు, సాగర తీరాన సేద తీరినట్టు అవుతుందని మరికొందరు సూచిస్తున్నారు.

రుషికొండ బిల్డింగ్‌ లోపల ఎలా ఉందని తెలుసుకోవడానికి చాలామంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఐతే ప్రభుత్వం అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్‌ కూడా ఇప్పటివరకూ లోపలకు వెళ్లి చూడలేదు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రమే ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలలోనే వెళ్లి చూశారు. ఆ తరువాత తాళాలు వేశారు.

మళ్లీ తెరవలేదు. వదల్లేరు.. పనికి రావడం లేదు కదా అని వదలకూడదు అన్నట్లుగా తయారైంది ఈ బిల్డింగ్‌ల పరిస్థితి. పవన్ వచ్చి వెళ్లారు.. సీఎం చంద్రబాబు రాక కోసం రుషికొండ ఎదురుచూస్తోంది. ఆయన వస్తే తప్ప.. బిల్డింగ్‌లను ఏం చేయాలన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఐతే రుషికొండ బిల్డింగ్‌లు ఎలా ఉపయోగపడతాయి.. ఎందుకు ఉపయోగపడతాయన్న సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ యుద్ధానికి.. టార్గెట్‌లకు మాత్రం బాగానే యూజ్ అవుతుందనే చర్చ జరుగుతోంది.

ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 12 మంది