ఉంటుందా ? ఊడుతుందా ? : తేలనున్న ఏపీ మండలి భవితవ్యం

ఏపీ శాసనమండలి రద్దవుతుందా? కొనసాగుతుందా అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దానిని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి, ఆమోదించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను మండలి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం మండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. అధికార వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ తరువాత 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై సభ్యులు చర్చించనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించే అవకాశముంది.
* మండలి వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు మండలి కోసం ఖర్చు అవుతోందని సీఎం జగన్ ఇదివరకే అసెంబ్లీలో స్పష్టం చేశారు.
* అసెంబ్లీలో రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, సీనియర్ రాజకీయ వేత్తలు ఉండగా పెద్దల సభ అవసరం ఏమోచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
* ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి వ్యవస్థ ఉండటాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
* అసెంబ్లీలో తీర్మానం చేసినా.. పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు ఎంత సమయం పడుతుందన్న దానిపైనా వైసీపీ కసరత్తులు చేస్తోంది.
* నిబంధనలకు విరుద్ధంగా శాసనసభలో జరిగే చర్చలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించడంతో అసెంబ్లీ సమావేశం ఏకపక్షంగా సాగనుంది.
Read More : కోతుల బెడద అంట : ఏపీ భవన్‌లో I Love Amaravathi బోర్డు తొలగింపు