చీరాల వైసీపీలో లీడర్ల పెత్తనం.. నడిపించే అసలు నాయకుడెవరో?

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీలో లీడర్లు ఎక్కువైపోవడంతో పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇప్పుడు ఆరుగురు వరకూ ఉన్నారు. వారిలో ఎవరితో ఎలా ఉంటే ఏమవుతుందో అనే ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ చీరాల నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చే పేరు ఆమంచి కృష్ణమోహన్. మాజీ గవర్నర్ రోశయ్య వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో సీన్ మారిపోయింది.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కరణం బలరామ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయితే ప్రస్తుతం బలరామ్ వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వెంకటేశ్ వైసీపీలో చేరిపోయారు. కరణం, ఆమంచి వర్గాల మధ్య నిత్యం ఏదో ఒక గలాటా జరుగుతూనే ఉండేది. అయితే బలరామ్ తెలివిగా పావులు కదిపి ఇప్పుడు వైసీపీకి దగ్గరివారైపోయారు. తన కంటే ముందే అనుచరులైన పోతుల సునీత, పోతుల సురేశ్‌ను వైసీపీలోకి పంపించారు బలరామ్. కొద్ది రోజుల క్రితమే కుమారుడిని వైసీపీలో చేర్చి.. తాను మాత్రం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నానని ప్రకటించారు. నిన్నటి వరకు చీరాల నియోజకవర్గ భాద్యుడిగా ఉన్న ఆమంచి ఇప్పుడు షాక్‌లో ఉన్నారు.
పార్టీ నిండుకుండలా :
ఇంతకాలం పెత్తనం చలాయించిన ఆమంచికి పోతుల సునీత, సురేశ్ రాకతో బ్రేకులు పడినట్టయ్యింది. మరోపక్క, బలరామ్ వయసు మీదపడడంతో కుమారుడు వెంకటేశ్ దగ్గరుండి అన్నీ చక్కబెడుతున్నారట. వీటితో పాటు బలరామ్ మరో అనుచరుడైన మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. స్థానికంగా బీసీలు ఏపని కావాలన్నా పాలేటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో మొన్నటి వరకూ నియోజకవర్గంలో ఒకడే నాయకుడు అనుకున్న… కానీ వీరిలో పార్టీని నడిపించే అసలు నాయకుడెవరన్నదే ఇప్పుడు ప్రశ్న. నిజానికి బలరాం, పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు పార్టీలో చేరక ముందు ఆమంచి ఒక్కడు మాత్రమే వైసీపీలో నాయకుడిగా ఉన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఇప్పుడు బలరామ్ అనుచర వర్గమంతా వైసీపీలో చేరిపోవడంతో పార్టీ నిండుకుండలా తలపిస్తొంది.
పైకి ఐకమత్యం.. లోలోపల కోల్డ్ వార్ :
ఈ నేపథ్యంలో నియోజకవర్గం నివురుగప్పిన నిప్పులా ఉందని జనాలు అంటున్నారు. వీరంతా స్థాయి ఉన్న నేతలు కావడంతో పార్టీలో అంతర్గత కలహాలు తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఆమంచి, కరణం బలరామ్ ఒక్కటి కలిసిపోయి పని చేయడమనేది జరిగే పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో పైకి ఐకమత్యంగా కనబడుతున్నా.. లోలోపల కోల్డ్ వార్ నడుస్తోంది. అదే సమయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా బలరాం అనుచరుడే కావడం విశేషం.ఆయన మాత్రం టీడీపీ తరఫునే మాట్లాడుతున్నారని చెబుతున్నారు.