Botsa : ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?

చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

Botsa : ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?

why botsa satyanarayana take class for vizianagaram ycp leaders

Botsa Satyanarayana: ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా.. మండలాధ్యక్షులు సామంత రాజుల్లా ఫీలైపోవద్దు.. సమస్యలు వచ్చినప్పుడు సర్దుకుపోవాలి.. కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలి.. లేదంటే దెబ్బతింటారు జాగ్రత్త అంటూ వైసీపీ శ్రేణులను అలెర్ట్ చేసి రాజకీయ చర్చకు తెరతీశారు మంత్రి బొత్స.. విజయనగరం జిల్లాలో వైసీపీకి మకుటం లేని మహరాజులా చలామణి అవుతున్న మంత్రి బొత్స.. ఎన్నడూలేనట్లు ఇలా కేడర్‌కు చురకలంటించడం ఆసక్తికరంగా మారింది. అసలు మంత్రి బొత్స ఈ విధంగా ఎందుకు మాట్లాడారు? తన మాటకు తిరుగులేని జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రికి ఆగ్రహమెందుకు? తెరవెనుక రాజకీయం ఏంటో చూద్దాం.

సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడినా ఓ సెన్సేషనే. ప్రతిపక్షాలపైనే కాదు.. స్వపక్ష నేతలనూ క్షమించరు మంత్రి బొత్స.. తేడా వస్తే ముఖంపైనే అడిగేస్తారు.. నిల్చొబెట్టి ఎడాపెడా వాయించేస్తారు. పార్టీలో క్రమశిక్షణ లోపించినా, నేతల మధ్య సఖ్యత కొరవడినా అస్సలు ఉపేక్షించరు మంత్రి బొత్స. సమయం, సందర్భం చూసి మైండ్ బ్లాక్ అయ్యేలా క్లాస్‌ పీకుతారు మంత్రి.. ఇక సొంత జిల్లా విజయనగరంలో పార్టీ పనితీరుపై మంత్రి చాలా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయం కొరవడటం.. గ్రూపులపై మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా.. ఎంపీపీలు సామంతుల్లా ఫీల్ అవుతున్నారంటూ చురకలు అంటించారు. ఊహించని విధంగా మంత్రి తీవ్రంగా హెచ్చరించడంతో నేతలు అందరిలోనూ ఒక్కసారిగా అలజడి రేగింది. నియోజకవర్గాల్లో నేతల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఇరువర్గాలకు సర్దిచెప్పాలే తప్ప, ఒక వర్గానికే కొమ్ముకాయడం కరెక్టు కాదని జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో బహిరంగంగా వ్యాఖ్యానించి అందరికీ ఓ మోస్తరు క్లాస్ పీకారు బొత్స. తన నియోజకవర్గంలోనూ ఇటువంటి సమస్యలు ఉన్నాయంటూ పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇక నుంచి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అయితే, బొత్స ఈ వ్యాఖ్యలు చేస్తుండగానే, వేదికపై ఉన్న విజయనగరం శాసన సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఏదో సర్దిచెప్పబోతుండగా, సున్నితంగా వారించారు బొత్స.

మంత్రి బొత్స వ్యాఖ్యలకు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలే కారణమని చెబుతున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్లతోపాటు బొత్స సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలోనూ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా జిల్లాలో చక్రం తిప్పుతోన్న బొత్సకు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారోనన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. నేతలు తలోదారిలో పయనిస్తుండటంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి.. పక్కా సమాచారంతోనే అందరికీ క్లాస్ పీకారంటున్నారు.

Also Read: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

జిల్లా కేంద్రం విజయనగరంలోనే ఎమ్మెల్యే కోలగట్ల, ఎంపీపీ మామిడి అప్పలనాయుడుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పార్టీ వర్గాల సమాచారం. ఓ గ్రామంలోని జగనన్న కాలనీ లేఅవుట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతున్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం, పలువురు సర్పంచ్లు, మండల స్థాయి నేతలు ఎంపీపీని కాదని, నేరుగా ఎమ్మెల్యే వద్దకే వెళ్తుండటం… ఇరు వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది. ఇదేవిధంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి కుటుంబానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీపీ సుధారాణి భర్త అంబళ్ల శ్రీరాములనాయుడు నెల్లిమర్ల మండల వైసీసీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. అంబళ్ల శ్రీరాముల నాయుడు మంత్రి బొత్స ఫాలోవర్ కాగా, ఓ భూమి విషయంలో ఎమ్మెల్యేకి అంబళ్ల కుటుంబానికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎంపీపీ అంబళ్ల కుటుంబానికి మండల నేతలంతా దూరమయ్యారు. తీవ్ర మనస్థాపం చెందిన అంబళ్ల, ఎంపీపీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు.

Also Read: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?

ఇక ఎస్.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలో క్యాడర్ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది. ప్రతి చిన్న విషయానికీ, ఈ రెండు వర్గాలు రోడ్డెక్కి బాహాబాహీకి దిగుతున్నాయి. ఇక మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తోన్న చీపురుపల్లిలో సైతం ఇటువంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ చక్రం తిప్పేదంతా బొత్స మేనల్లుడు చిన్న శ్రీనే. జడ్పీ చైర్మన్‌ చిన్న శ్రీను హవాతో స్థానిక నేత, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కొంత ఇబ్బందిపడుతున్నారు. చిన్న శ్రీను, ఎంపీ బెల్లాన మధ్య చాన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. పదవుల విషయంలో తన వర్గానికి న్యాయం జరగడం లేదని మదనపడుతున్నారు ఎంపీ చంద్రశేఖర్. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా, చిన్న శ్రీను వద్దకే వెళ్లాల్సి రావడం.. ఎంపీ వర్గంలో అసంతృప్తి పెంచుతోందంటున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిణామాలు ఉండటంతో మంత్రి బొత్స జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. నేతలు ఎవరికి వారు.. తామే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తుండటం.. సమన్వయ లోపానికి దారితీస్తోందని అభిప్రాయపడుతున్నారు మంత్రి.. అందుకే అందరూ ఒకే చోట ఉన్నప్పుడు కడిగి పారేశారంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు విభేదాలు పక్కనపెట్టి.. ఏకతాటిపై నడుస్తారని ఆశిస్తున్నారు కార్యకర్తలు.