చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నా.. అందుకే వైసీపీని వీడుతున్నా: మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు

కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదు..

చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నా.. అందుకే వైసీపీని వీడుతున్నా: మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు

mopidevi venkata ramana : తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్టు ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. గురువారం ఢిల్లీలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తనతో పాటు బీద మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీని వీడొద్దని వైసీపీ పెద్దలు కోరినా.. తనకున్న ఇబ్బందులను గమనంలోకి తీసుకుని పార్టీ మారుతున్నట్టు వివరించారు. స్థానిక టీడీపీ నాయకులతో సమస్యలు వచ్చినా సమన్వయంతో ముందుకు వెళతానని అన్నారు.

”రాష్ట్రంలో వైసీపీ ఒడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో నాకున్న ఇబ్బందులు సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను. ఒక పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నా. గత ఎన్నికల సమయంలో నాకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందాను. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోలేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నాను.

Also Read: వైసీపీని వీడేది లేదు.. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తా : విజయసాయిరెడ్డి

కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదు.. భవిష్యత్తులో లోటుపాట్లపై సమీక్ష చేసుకుంటారనుకుంటున్నా. నాకు రాజ్యసభకు రావడం ఇష్టం లేదు. నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని. పార్టీని వీడొద్దు పార్టీలోనే ఉండాలని వైసీపీ పెద్దలు నాతో మాట్లాడారు.. నా సమస్యలు వారికి చెప్పాను. నేను చేరే పార్టీలో ముందు నుంచి ఉన్న కొందరు నేతలు, కార్యకర్తలతో స్థానికంగా సమస్యలు వస్తాయి. అది సహజం. సమన్వయంతో ముందుకు వెళ్తాను. నా నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు బీద మస్తాన్ రావు ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు. టీడీపీ పార్టీ పెద్దలతో మాట్లాడాను. త్వరలో టీడీపీలో చేరతాన”ని మోపిదేవి వెంకటరమణ అన్నారు.