GVMC: విశాఖ మేయర్‌పై ఏప్రిల్ 19నే అవిశ్వాసం ఎందుకు..? నాలుగేళ్ల నిబంధనే కారణమా..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు..? ఏప్రిల్ 19వ తేదీనే అవిశ్వాసం ఎందుకు..

GVMC
GVMC: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అవిశ్వాసం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11గంటలకు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. దీంతో కొద్దిరోజులుగా విశాఖ మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడే అవకాశం ఉంది. అయితే, ఏప్రిల్ 19వ తేదీనే మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి ఎందుకు ఎంచుకున్నారన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు..? ఏప్రిల్ 19వ తేదీనే అవిశ్వాసం ఎందుకు.. మతలబు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించిన తరువాత జీవీఎంసీ పాలకవర్గానికి నాలుగేళ్లు నిండేవరకూ అవిశ్వాసానికి వీలుపడదనే నిబంధన పెట్టారు. దీంతో కూటమి పార్టీలు మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటివరకూ ఎదురు చూడాల్సి వచ్చిందట. విశాఖ కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటై ఏప్రిల్ 18వ తేదీతో నాలుగేళ్లు పూర్తవుతుంది. దీంతో నిబంధనల ప్రకారం 19వ తేదీ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి ఎక్స్ అఫీషియో సభ్యులు మరో 13మంది ఉన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74. దీంతో ఇవాళ జరిగే అవిశ్వాస తీర్మానంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.