జగన్‌ హస్తిన పర్యటన వెనుక అసలు సీక్రెట్!

  • Published By: sreehari ,Published On : February 14, 2020 / 12:52 PM IST
జగన్‌ హస్తిన పర్యటన వెనుక అసలు సీక్రెట్!

Updated On : February 14, 2020 / 12:52 PM IST

ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఓ సీఎం వెళ్తున్నారంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలే చర్చకు వస్తాయని అనుకోవడం సహజమే. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడానికి వెళ్తున్నారంటే మాత్రం రాజకీయాంశాలే ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయనే టాక్‌ ఉంది. అప్పట్లో చంద్రబాబు అయినా.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అయినా రాజకీయాంశాలకే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.

అలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో.. వెంటనే జగన్‌ హస్తినకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈసారి చాలా టైమ్‌ ప్రధానితో గడిపారు జగన్‌. చాలా విషయాలు డిస్కస్‌ చేశారట. మూడు రాజధానులు, హైకోర్టు, పోలవరం, ఇంకా ప్రత్యేక హోదా… ఇలా ఎన్నో అంశాల గురించి ప్రధానిని అడిగారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఇవి కాకుండా ప్రస్తావించిన విషయాలు వేరే ఉంటాయని జనాలు అంటున్నారు. 

డిసైడ్ అయిన సీఎం జగన్ :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బొక్కబోర్లా పడింది. అధికారం సంగతి దేవుడెరుగు.. చిత్తుచిత్తు అయ్యింది. ఈ ఎఫెక్ట్‌ రాబోయే రాజ్యసభ ఎన్నికలపై పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారనేది టాక్‌. అందుకే హుటాహుటిన ఢిల్లీ ప్రయాణమయ్యారని అంటున్నారు.

ప్రధాని మోదీతో సాగిన సుదీర్ఘ చర్చలో ఈ అంశంపైన ప్రధానంగా చర్చ జరిగిందంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు. చాలా బిల్లులను పాస్‌ చేయించుకోవాలంటే అక్కడ మెజారిటీ తప్పనిసరి. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే తమ సంఖ్యను పెంచుకొనేందుకు బీజేపీకి అవకాశం ఉండేది. కానీ ఆ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీకి అవసరం. అది గుర్తించిన జగన్‌.. ఏమాత్రం లేట్‌ చేయకుండా ఢిల్లీలో వాలిపోయారని అనుకుంటున్నారు. 

అదంతా వృథా ప్రయాసేని :
రాష్ట్రానికి సంబంధించిన చాలా పనులను చేయించుకోవడంతో పాటు.. వ్యక్తిగత అంశాలను కూడా జగన్‌ ప్రస్తావించారంటున్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినా.. ఆ విషయంలో బీజేపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది కాబట్టి అదంతా వృథా ప్రయాసే అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు జగన్‌ సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు.

అందుకు ప్రతిగా శాసనమండలి రద్దు అంశాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి.. త్వరగా పూర్తి చేయాలని ప్రధానిని కోరారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాకు మీరు.. మీకు మేము.. అన్న రీతిలో సాధారణంగా ఇలాంటి చర్చలు సాగుతుంటాయని అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి విధానమే ఉండేదట. 

ఒక్కరే ఎందుకు కలుస్తారంటే? :
రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పూర్తిగా ప్రస్తావించేందుకు అయితే రహస్యంగా మాట్లాడుకొని, ఎవరూ లేకుండా చర్చలు సాగించాల్సిన అవసరం ఏముంటుందన్నది జనాల మైండును ఎప్పుడూ తొలిచేసే ప్రశ్న. నాడు చంద్రబాబు అయినా.. నేడు జగన్‌ అయినా.. ఏకాంత భేటీలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. రాష్ట్రానికి నిధులు, పథకాల గురించే మాట్లాడాలనుకుంటే సంబంధిత అధికారులైనా వెంట ఉండాలి కదా? కానీ అలా కాకుండా ఒక్కరే ఎందుకు కలుస్తారు? మహా అయితే నమ్మకస్తుడైన ఓ ఎంపీ కూడా వెంట ఉంటారంతే.

ఈ భేటీలు రాజకీయ ప్రధానమైనవి కాకపోతే అంత రహస్యంగా ఉంచడం ఎందుకనే చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, పెద్దలు, బీజేపీ నేతలు ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక హోదా సాధ్యమయ్యేది కాదని తేల్చేశారు. కానీ, ఇంకా దాని గురించి ప్రధానితో మాట్లాడారంటే విశ్వసించాలా అని ప్రశ్నిస్తున్నారు. 

అందుకే జగన్ ఢిల్లీ వెళ్లారా? :
రాష్ట్రంలో పరిస్థితుల గురించి కొంత చర్చించినా.. ఎక్కువ భాగం మాత్రం రాజకీయాంశాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపైనే రాజకీయ పార్టీలు దృష్టి పెడతాయన్నదే నిజమని జనాలు అంటున్నారు. సొంత కార్యాలను చక్కబెట్టుకోవడానికే జగన్‌ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాబట్టాల్సిన నిధుల గురించి మాట్లాడేందుకు మాత్రమే వెళ్లారని అధికార పక్షం గట్టిగా వాదించడం సహజమే.

ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోక తప్పదు. ఎందుకంటే ఆ రెండూ నిజమే కాబట్టి అంటున్నారు. ప్రధానికి ఒక వినతి పత్రం ఇవ్వడం.. ప్రధాని ఏదో చెప్పడం.. రాజకీయాంశాలు మాట్లాడుకోవడం.. కామన్‌గా జరిగేవి ఇవేనని చెప్పుకుంటున్నారు.