మనవాళ్లే అన్నారు అయినా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జగన్ ఎందుకు కఠినంగా ఉన్నారు!

కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివేస్తున్నారు. దీంతో ఆంధ్రావాళ్లంతా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమను సొంత రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. బోర్డర్ వద్ద ఆగిపోయిన వారి ఆందోళనలపై ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. లాక్ డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనవాళ్లు అయినా రాష్ట్రంలో అడుగుపెట్టరాదని జగన్ కఠినంగా ఉన్నారు.
ఎక్కడివారు అక్కడే ఉండిపోండి :
ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి ఒక్కసారిగా రాష్ట్రంలోకి వస్తే కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని జగన్ అంటున్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో సొంత రాష్ట్ర వాసులైనప్పటికీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాలని సూచించారు. పొరపాటుచేస్తే, పరిస్థితి ఎక్కడిపోతుందో మనకు తెలియదన్నారు. మీకు ఎలాంటి అవసరమున్నా వెంటనే 1902కి కాల్ చేయాలని సూచించారు. మీకు కావాల్సిన సాయం అందుతుందని చెప్పారు. వసతులుపరంగా ఎలాంటి లోటు చేయమని… అన్నివిధాలుగా బాగా చూసుకొంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారని జగన్ అన్నారు.
సొంతబిడ్డల్లా చూసుకుంటామన్నారు తలసాని :
రాష్ట్రంలో ఇప్పటికీ 10 పాజిటీవ్ కేసులున్నాయని, జాగ్రత్తగా లేకపోతే ఈ కేసులు పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. అందరం కలిసి చేస్తేనే వైరస్‌ను అడ్డుకోగలమని జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రా బోర్డర్ కు చేరుకున్న వారంతా వచ్చిన ప్రాంతానికి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఆంధ్రకు బయల్దేరిన వారందరిని హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. హాస్టళ్లను ఖాళీ చేయించిన యాజమాన్యాలతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని, మనవాళ్లను సొంత బిడ్డల్లా చూసుకుంటామని ఆయన చెప్పారని జగన్ పేర్కొన్నారు.
ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మరో రెండు వారాలు ఓపిగ్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మీరు పడుతున్న కష్టాన్ని తాము అర్థం చేసుకోగలమని.. బాధగా అనిపిస్తున్నప్పటికీ కఠినంగా వ్యవహరించాల్సిన సమయమని జగన్ చెప్పారు. క్రమశిక్షణతోనే కరోనాను గెలవగలమని, అప్పుటివరకూ కష్టమైన తప్పదన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు కాస్తా ఓపిక పట్టాలని జగన్ సూచించారు.
Also Read | అమెరికా బాటలోనే! : భారత్ లో కరోనా ఎలా విజృంభిస్తుందో చూడండి