ఎవరి పక్షమో : జీవీఎల్ మాటల అంతరార్థం ఏంటో?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనకు తోచింది మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెబుతారా? లేక తన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదనే టాక్ నడుస్తోంది. ఆయన జగన్ సర్కారు నిర్ణయానికి మద్దతుగా మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటారు.. ఆ తర్వాత మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదంటారు.. అంతలోనే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటారు.. ఆనక కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతిస్తున్నామంటారు. అంతే గానీ.. అది పార్టీ అభిప్రాయమా.. తన అభిప్రాయమా అన్నది మాత్రం చెప్పరు. దీంతో ఆయన వైఖరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అర్థం కాని లాజిక్కులతో :
ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకిస్తారు. అదే పార్టీ నిర్ణయమనేలా మాట్లాడతారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదంటారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించబోదని అంటారు. అదే సమయంలో జీవీఎల్ రంగప్రవేశం చేస్తారు. అసలు కేంద్రానికి రాష్ట్ర నిర్ణయంతో సంబంధం లేదని తేల్చేస్తారు. అర్థం కాని లాజిక్కులు చెప్తారు. కేంద్రానికి చెప్పే చేస్తున్నామని అర్థమొచ్చేలా వైసీపీ నేతలు చెబుతారు. దానిని బీజేపీలోని ఇతర నేతలు ఖండిస్తారు గానీ.. జీవీఎల్ నరసింహారావు మాత్రం నేరుగా దానిని ఖండిస్తున్నామని చెప్పకుండా.. అప్పట్లో చంద్రబాబు కూడా అంతా కేంద్రానికి తెలిసే చేస్తున్నామని చెప్పేవారని, ఇప్పుడు జగన్ సర్కారులోని నేతలు కూడా అలాగే మాట్లాడుతున్నారని అంటారు.
పార్టీ నేతల్లో అయోమయం :
బీజేపీ నేతలంతా ప్రెస్‌మీట్లు పెట్టి ఒక విషయం చెబితే.. దానిని ఖండించేలా జీవీఎల్ మాట్లాడుతుంటారు. ఇదంతా చూసిన పార్టీ నేతలు అసలు జీవీఎల్ ఉద్దేశమేంటో తెలియక అయోమయంలో పడిపోతున్నారట. పార్టీ పరంగా తనదే ఫైనల్ అన్నట్లు ఒక్కోసారి ఆయన మాటలుంటాయి. పార్టీ ప్రతినిధిగా తాను చెప్పినదే కరెక్ట్ అనేలా చెబుతారు. ఇదంతా చూస్తుంటే పార్టీ వ్యూహంలా కనిపిస్తోందని జనాలు అనుకుంటున్నారు. ఎవరినీ దూరం చేసుకోవడం లేక ఇష్టం లేకనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోందని భావిస్తున్నారు. ఎన్నికల సమయానికి ఎవరితో అయినా అవసరం ఉంటుందనే ఉద్దేశంతో పాము చావకూడదు.. కర్ర విరగకూడదనే రీతిలో వ్యవహరిస్తోందని చెబుతున్నారు.
జీవీఎల్ మద్దతు ఎటో? :
జీవీఎల్ మాట్లాడితే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని అందరూ భావించేవారు. కానీ, రాజధాని వ్యవహారంలో మాత్రం ఆయన విధానం ఎవరికీ అంతుచిక్కనిదిలా మారిపోయిందని అంటున్నారు. ప్రస్తుత విషయాన్ని మాట్లాడుతూ మధ్యలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తారు. దీనిని బట్టి ఇదంతా బీజేపీ ఢిల్లీ పెద్దల వ్యూహమేనని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద జీవీఎల్ ఏ నిర్ణయానికి మద్దతిస్తున్నారో తెలియని కన్‌ఫ్యూజన్‌లో జనాలను పడేసి బీజేపీ ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోందని జనాలు అనుకుంటున్నారు.