గుంటూరు రాజకీయాల్లో సంచలనం : లగడపాటి ఎంట్రీతో.. రాయపాటికి హ్యాండ్

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 05:45 AM IST
గుంటూరు రాజకీయాల్లో సంచలనం : లగడపాటి ఎంట్రీతో.. రాయపాటికి హ్యాండ్

Updated On : March 11, 2019 / 5:45 AM IST

గుంటూరు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ పొలిటీషియన్, అనేకసార్లు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకి టీడీపీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా రాయపాటికి ఈసారి టికెట్ నిరాకరించినట్లు సమాచారం. రాయపాటిని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన వివరాలు బయటకు రాకపోయినా.. రాయపాటి ఫ్యామిలీకి టికెట్ లేదనే వార్త మాత్రం పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతుంది. వాస్తవంగా ఈసారి టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని కొన్నాళ్లుగా ఎంపీ రాయపాటి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
రాయపాటికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవటానికి కారణం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనే ప్రచారం జరుగుతుంది. నరసనరావుపేట నుంచి ఈసారి లగడపాటి రాజగోపాల్ బరిలోకి దిగుతారని.. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు పార్టీ సీనియర్స్. కొన్ని రోజుల క్రితమే ఈ విషయంపై స్పీకర్ కోడెలతో లగడపాటి రాజగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు. నరసరావుపేట నియోజకవర్గం కోడెల సొంత నియోజకవర్గం. ఆయన మద్దతు లేకపోతే టీడీపీ తరుపున ఎవరైనా అక్కడ నుండి నెగ్గడం కష్టమే. ఈ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని కోడెలతో లగడపాటి చర్చలు జరిపారు. తెర వెనక జరిగిన ఈ రాజకీయ మంత్రాంగం.. ఇప్పుడు తెరపైకి వచ్చింది. నరసనరావుపేట నుంచి రాయపాటిని తప్పించి.. లగడపాటిని తీసుకురావటం ఖాయంగా కనిపిస్తోంది. మరో 48 గంటలు గడిస్తేనే.. పూర్తి క్లారిటీ వస్తుంది.