Yaas Cyclone : తీవ్ర తుఫాన్..అప్రమత్తమైన ఏపీ సర్కార్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Yaas Cyclone : తీవ్ర తుఫాన్..అప్రమత్తమైన ఏపీ సర్కార్

Yass Cyclone

Updated On : May 24, 2021 / 1:04 PM IST

Cyclone AP : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం ఏపీపైన కూడా పడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష జరిపారు.

ఇప్పటికే తుఫాన్ కారణంగా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. తుఫాన్‌ దృష్ట్యా సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ జిల్లాల్లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

అటు కేంద్రం హోంమంత్రి అమిత్ షా కూడా తుఫాన్ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలు ఏపీ సహా మిగిలిన రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాస్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై దిశానిర్దేశం చేశారు.

యాస్ తుఫాన్ ఈ నెల 26న తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం చేరుకొని.. అదేరోజు సాయంత్రం పారాదీప్‌ – సాగర్‌ దీవుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్‌ ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌లలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

మరోవైపు నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌- నికోబార్‌ దీవుల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది.

Read More : Telangana Lockdown : లాక్‌డౌన్‌ తో తెలంగాణలో కరోనా ముప్పు తప్పిందా ?