సీఎం జగన్ నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు, నాపై వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు- ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

ప్రజల కోసం జగన్ చెప్పిన పని చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు.

సీఎం జగన్ నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు, నాపై వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు- ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Singanamala MLA Jonnalagadda Padmavathy

Updated On : January 9, 2024 / 8:28 PM IST

Jonnalagadda Padmavathy : శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో తాను మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీయడంపై స్పందించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తనను సొంత చెల్లిలా చూసుకున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. నేను జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని ఆమె వివరణ ఇచ్చారు. నేను ప్రశ్నించింది అధికారులను.. సీఎం జగన్ ను కాదని ఆమె స్పష్టం చేశారు. అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాత్రమే మాట్లాడాను అని పేర్కొన్నారు. నేను అన్న మాటలు సీఎం జగన్ కు ఆపాదించి ప్రచారం చేశారని వాపోయారు. నేను మాట్లాడింది పార్టీకి, సీఎం జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు ఎమ్మెల్యే పద్మావతి.

”మా రాజకీయ భవిష్యత్తు జగన్ తోనే ఉంటుంది. సీఎం జగన్ పై నమ్మకంతోనే అయన వెంట నడుస్తున్నాం. నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు. జిల్లా స్థాయిలో అవ్వాల్సిన పనులు సీఎం ఆఫీస్ వరకూ వెళ్లాల్సి వస్తుందని బాధ తప్ప ఏమీ లేదు. ప్రతిసారీ తాడేపల్లికి రావాల్సి వస్తుందని ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడా. అసలు విషయం తెలుసుకోకుండా రాద్దాంతం చేశారు. ప్రజల కోసం జగన్ చెప్పిన పని చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు. ఇప్పటికిప్పుడు సీఎం జగన్ నన్ను నువ్వు పక్కన ఉండు అంటే ఆయన నిర్ణయానికి అంగీకరిస్తా” అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తేల్చి చెప్పారు.

Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

నిన్న ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. ఫేస్ బుక్ లో సీఎంవోపై విమర్శలు చేశారు. జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. దీంతో తాడేపల్లి నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. తన వ్యాఖ్యలపై సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు.

”నేను అధికారులను ఉద్దేశించి అన్న మాటలను జగన్ కు ఆపాదించారు. ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. మరో పని లేనట్లు నా మీదే ఫోకస్ పెట్టారు. 2014 ఎన్నికలకన్నా ముందు జగన్ అన్నను కలిసినప్పుడే నేను ఒకటి నిర్ణయించుకున్నాను. ఇలాంటి నాయకుడితో కలిసి నడవాలని ఫిక్స్ అయ్యా. జగన్ విజన్ ఏంటి? పేదలను ఎలా ఆదుకోవాలి? కలిసిన తొలిరోజునే జగన్ మాతో డిస్కస్ చేశారు. అది నమ్మే ఇన్నేళ్లు పార్టీలో ఉన్నాం. జగన్ తో నడిచాం. తన కుటుంబసభ్యురాలిగా, సొంత చెల్లిలా జగన్ నన్ను చూసుకున్నారు, ఆదరించారు.

ఫేస్ బుక్ లైవ్ ఇచ్చాక దాన్ని మార్చడానికి ఏమీ లేదు. నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినా.. జగన్ ను అన్నట్లు ఆపాదించడం బాధాకరం. నేను ఎవరిని ప్రశ్నించాను అన్నది ఎల్లో మీడియాలో రాయలేదు. నేను ప్రశ్నించింది, పోరాడుతున్నది అధికారులతోనే. జగన్ అన్నతో కాదు. సీఎం ఆఫీసుకి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను. అంటే, జగన్ అన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పా. జిల్లా స్థాయిలో అయిపోవాల్సిన ప్రతీ చిన్న పని కోసం కూడా నేను సీఎం ఆఫీసుకి వెళ్లాల్సి వస్తోంది అన్న ఒక్క బాధ తప్ప మరొకటి లేదు. వారం రోజుల నీళ్లకు కూడా అధికారులను అడిగితే కుదరదని చెప్పడం నాకు బాధ అనిపించి అలా మాట్లాడాను.

Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతున్నారు. నా నియోజకవర్గ ప్రయోజనాల కోసం నేను కూడా పోరాడుతున్నా. ప్రతీసారి సీఎం ఆఫీసుకి వెళ్లాల్సి వస్తోంది అనే బాధతోనే ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడాను. దాన్ని రాద్దాంతం చేసేశారు. నేను అన్న మాటలను వక్రీకరించారు. జగన్ ను వ్యతిరేకించినట్లు, పార్టీని వదిలిపోతున్నట్లు చిత్రీకరించారు” అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.