ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్యాకేజీ సరికాదు- లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి

నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాపై దాడులకు పాల్పడ్డారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఇంతా చేసి నాపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మిథున్ రెడ్డి వాపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్యాకేజీ సరికాదు- లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి

Mp Midhun Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్.. విభజన చట్టంలో ఇచ్చిన హామీయే అని, ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయని ఆయన గుర్తు చేశారు. హోదాకు బదులు ప్యాకేజీ అన్నది సరికాదన్నారు. ప్యాకేజీ.. హోదాతో సరిపోదని తేల్చి చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం ఒక పెద్ద తప్పిదం చేసిందని మిథున్ రెడ్డి ఆరోపించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారని.. వరద ఉధృతికి కాఫర్ డ్యామ్ దాటుకుని డయాఫ్రం వాల్ దెబ్బతిందని అన్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

అమరావతి నిర్మాణానికి ఇచ్చే నిధులు.. రుణం రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో ఉండాలని కోరారు మిథున్ రెడ్డి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్లాంటుకు సొంతంగా ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని కోరుతున్నామన్నారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. విశాఖపట్నం మెట్రో స్టేటస్ ఏంటో చెప్పాలని మిథున్ రెడ్డి కోరారు. ఏపీలో సూపర్ 6 హామీలు ఇచ్చారని, అవి సారీ 6 గా మారకూడదని చెప్పారు.

నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాపై దాడులకు పాల్పడ్డారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఇంతా చేసి నాపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మిథున్ రెడ్డి వాపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఇలా ఉంటే, రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మూలధన వ్యయం కోసం కేటాయించిన రూ. 11 లక్షల కోట్లను ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టొద్దని కోరారు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోనే ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు.

Also Read : మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది.. అద్దంలో కూడా ఆయనే కనిపిస్తున్నారు: జగన్‌పై షర్మిల ఫైర్