దివిస్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

దివిస్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

Updated On : January 9, 2021 / 10:52 AM IST

divis laboratories : తూర్పు గోదావరి జిల్లా కొత్తపాకలలోని దివిస్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత స్థలం నుంచి ఎలాంటి వ్యర్థాలను విడిచిపెట్టవద్దని పరిశ్రమల శాఖ నుంచి 2021, జనవరి 09వ తేదీ శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలాల్లో హేచరీలు, ఆక్వా ప్రాజెక్టులు ఉన్నాయని వెల్లడించింది. జీవనోపాధికి భంగం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం విశేషం. ఇదంతా..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన చేపడుతున్న సందర్భంలో ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక ప్రజల వ్యతిరేకత : –
దివిస్ ఫ్యాక్టరిని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వ్యర్థాల వల్ల కాలుష్యం తీవ్రంగా వెదజల్లుతోందని గత కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ దివిస్ ను వ్యతిరేకించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఫ్యాక్టరీ పనులు ప్రారంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాలు, హేచరీస్, చేపలు, రొయ్యలు నాశనమౌతుందని, భూగర్భ జలాలు కలుషితమౌతాయని ప్రజలు వాదిస్తున్నారు. తమ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

కొత్తపాకల సమీపంలో ఫ్యాక్టరీ : –
తొండంగి మండలం కొత్తపాకల సమీపంలో దివిస్‌ ఫార్మా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కొత్తపాకల, పంపాదిపేట, తాటియాకులపాలెం గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఫార్మీ ఫ్యాక్టరీ వల్ల తమ మనుగడకు తీవ్ర విఘాతం కలుగుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో పరిశ్రమకు అనుమతులు ఇవ్వగా అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలతో హోరెత్తించాయి. 2016 లో వామపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసింది దివిస్ యాజమాన్యం.

దివిస్ పరిశ్రమపై దాడి : –
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది నవంబర్‌లో యాజమాన్యం మళ్లీ పనులు ప్రారంభించింది. గత నెలలో దివిస్‌ సమీప గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేశారు. గత నెల 17న దివిస్‌ పరిశ్రమపై దాడి చేశారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో పోలీసులు సుమారు 150 మంది పై నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. దివిస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారు ఇప్పటికీ పలు జైళ్లలో రిమాండ్‌లో ఉన్నారు.

పవన్ పర్యటన : –
దివీస్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ వాళ్లకు మద్దతుగా వెళ్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదత స్థలం నుంచి ఎలాంటి వ్యర్థాలను విడిచి పెట్టవద్దని పరిశ్రమల శాఖ ఆదేశించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో హేచరీలు, ఆక్వా ప్రాజెక్టులు ఉన్న దృష్ట్యా ఈ ఆదేశాలిస్తున్నట్టు వెల్లడించింది. జీవనోపాధికి భంగం కలుగుతుందనే ఆందోళనలో ప్రజలు ఉన్నందున ఈ ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.