Tammineni Sitaram: జగన్‌ నిర్ణయంతో తమ్మినేని సీతారాంకి కొత్త టెన్షన్‌..

ఆముదాలవలసలో మారిన రాజకీయ పరిణామాలతో చింతాడను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన జగన్.. తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు.

Tammineni Sitaram: జగన్‌ నిర్ణయంతో తమ్మినేని సీతారాంకి కొత్త టెన్షన్‌..

Updated On : November 14, 2024 / 9:13 PM IST

ఆముదాలవలస.. తమ్మినేని అడ్డా ! ఆయన రాజకీయ ఓనమాలు దిద్దింది అక్కడే.. మంత్రిగా, స్పీకర్‌గా ఎదిగింది అక్కడి నుంచే ! అలాంటి ఆముదాలవలసలో.. తమ్మినేనికి పెద్ద కష్టమే వచ్చిందట. నియోజకవర్గం తనకు దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయట. దీంతో తమ్మినేనికి ఎక్కడలేని బెంగ పట్టుకుందని టాక్‌. ఇంతకీ ఆముదాలవలసలో ఏం జరుగుతోంది.. తమ్మినేనికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.. అసలు తమ్మినేనికి జగన్‌ ఎందుకు షాక్ ఇచ్చినట్లు..

ఆముదాలవలస, తమ్మినేని.. ఈ రెండు పేర్లను వేరు చేసి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కష్టమే. ఇక్కడి నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన తమ్మినేని.. ఆ తర్వాత మంత్రిగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎదిగారు. తమ్మినేనికి ఫైర్‌బ్రాండ్ అని పేరు. పదవి ఉన్నా లేకపోయినా.. లోడ్‌ చేసిన గన్‌లా.. ఫైరింగ్‌కు రెడీ అన్నట్లు కనిపిస్తుంటారు ఎప్పుడూ ! అలాంటి తమ్మినేనికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిందట. జగన్ ఇచ్చిన షాక్‌తో.. తమ్మినేనికి కొత్త టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. తనకు కంచుకోటలాంటి ఆముదాలవలస.. తనకు, తనకు కుటుంబానికి దూరం అవుతుందేమోనని తమ్మినేని తెగ కంగారు పడిపోతున్నారట.

పార్టీలో భారీ మార్పులు
అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంపై పోస్టుమార్టం నిర్వహించిన జగన్.. పార్టీలో భారీ మార్పులు చేస్తున్నారు. జిల్లాలవారీగా కొత్తగా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల్లో పదవులతో పాటు.. అవసరమైన చోట నియోజవర్గాలకు కొత్త ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఇలా తమ్మినేనికి షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసకు కొత్త సమన్వయకర్తను నియమిస్తూ జగన్‌ తీసుకున్నారు. ఇంచార్జిగా త‌మ్మినేని సీతారాంను త‌ప్పించిన జ‌గ‌న్‌.. ద్వితీయ శ్రేణి నాయ‌కుడిగా ఉన్న చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.

మొన్నటి ఎన్నిక‌ల్లో ఆమదాలవలస నుంచి ర‌వికుమార్ టికెట్ ఆశించినా.. జ‌గ‌న్ మాత్రం త‌మ్మినేనికే ప్రాధాన్యత ఇచ్చారు. ఐతే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో త‌మ్మినేని ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ఐతే ఆముదాలవలసలో మారిన రాజకీయ పరిణామాలతో చింతాడను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన జగన్.. తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు. ఇదే తమ్మినేనికి టెన్షన్‌ పుట్టిస్తోంది.

ఆముదాలవలసలో గ్రూప్‌ వార్‌కు చెక్‌ పెట్టేందుకే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి తమ్మినేని స్పీకర్ అయిన తర్వాత.. ఆముదాలవలసలో పరిస్థితులు మారుతూ వచ్చాయ్‌. మూడు గ్రూప్‌లు, ఆరు వర్గాలతో.. స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా వైసీపీపరిస్థితి తయారైంది.

పార్టీలో చీలికలు వచ్చినట్లు ప్రచారం
తమ్మినేని కుటుంబం కారణంగా.. గ్రామస్థాయిలో పార్టీలో చీలికలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీతారాం గెలుపు కోసం కష్టపడ్డ నేతలే.. ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో తమ్మినేనికి షాక్ ఇచ్చిన సువ్వారి గాంధీ.. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇలాంటి గ్రూప్‌వార్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త నాయకత్వం అవసరం అని కేడర్‌ నుంచి వినిపిస్తుండగా.. ఇంచార్జిని మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్‌.. ఆముదాలవలస రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని బరిలో దింపే ఆలోచనలో ఉన్న తమ్మినేనికి.. ఇప్పుడు జగన్ నిర్ణయంతో షాక్ తగిలినట్లు అయింది. చిరంజీవి నాగ్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా.. ఆయన నాయకత్వాన్ని పార్టీ ద్వితీయ స్థాయి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఐతే ఇప్పుడు ఇంచార్జి మార్పుతో.. కుమారుడి రాజకీయభవిష్యత్‌పై తమ్మినేనికి కొత్త టెన్షన్ పట్టుకుందట. కంచుకోటలాంటి ఆముదాలవలసకు.. తను, తన కుటుంబం దూరం కావాల్సి వస్తుందేమోననే టెన్షన్‌.. తమ్మినేనికి కొత్త సమస్యగా మారిందనే ప్రచారం జరుగుతోంది.

ఇదంతా ఎలా ఉన్నా… ఆముదాలవలస నూతన నాయకత్వ బాధ్యతలు చేపట్టిన చింతాడకు.. ఆ పదవి కత్తి మీద సాములా మారడం ఖాయంగా కనిపిస్తోంది. చింతాడ రవికి తమ్మినేని వర్గం… ఎంత వరకు సపోర్టు చేస్తుందన్నది మిలియన్‌ డాలర్ ప్రశ్నగా మారింది.

నిన్న ఆర్జీవీ.. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి.. అరెస్టుల పర్వంలో నెక్ట్స్‌ జరగబోయేదేంటి?