మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, అందరికి జగన్ భరోసా.. ఎల్‌జీని తరలిస్తాం

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 09:55 AM IST
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, అందరికి జగన్ భరోసా.. ఎల్‌జీని తరలిస్తాం

Updated On : May 7, 2020 / 9:55 AM IST

గ్యాస్ ప్రమాద ఘటన దురదృష్టకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఎల్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో ఇలాంటి ప్రమాదం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదన్నారు. ఆ విషయమే తమ మనస్సును కలిచివేస్తోందని చెప్పారు.

విశాఖ ఘటన చాలా బాధాకరమన్నారు. ఘటనపై అధ్యయానికి కమిటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఘటనపై లోతుగా అధ్యయనం చేసి కమిటి నివేదిక ఇస్తుందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలని అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇస్తుందని జగన్ చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారని సీఎం జగన్ తెలిపారు.  

బాధితుల్లో  చాలామంది కోలుకున్నారని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని జగన్ ప్రకటించారు. ఎల్‌జీ కంపెనీ ఎంత ఇచ్చిన సంబంధం లేదన్నారు. మిగిలిన మొత్తం ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. కంపెనీ నుంచి వీలైనంత వరకు రాబడతామన్నారు. స్వల్పంగా అస్వస్థతకు గురైనవారికి రూ.25వేల వరకు అందిస్తామన్నారు. 

వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజులు ఆస్పత్రుల్లో ఉండేవారికి రూ.లక్ష సాయం అందిస్తామని చెప్పారు. బాధితులందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, గ్యాస్ ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని కలెక్టర్ కు ఆదేశాలిస్తామని చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతుననవారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.  

Also Read | విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, సీఎం జగన్ తో మాట్లాడిన ప్రధాని మోడీ