YS Jagan: అందరూ చొక్కాలు మడతేసి, ఆ కుర్చీ మడతపెట్టి..: సీఎం జగన్
‘ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అని జగన్ వ్యాఖ్యానించారు.

YS JAGAN
గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతేసి, చంద్రబాబు నాయుడి కుర్చీని మడతపెట్టి, చీపురితో ఊడ్చేసి టీడీపీ సీట్లను తగ్గించారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు. మరోసారి చొక్కాలు మడతేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆయన అన్నారు. రాప్తాడు ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
‘ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలను అక్కచెల్లెమ్మలకు అర్థం అయ్యేలా చెప్పండని అన్నారు.
చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారం గురించి ప్రజలకు వివరించి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు.
రంగు రంగుల మ్యానిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఎవరికైనా సామాజిక న్యాయం గుర్తుకువస్తుందా? అని అడిగారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ పథకాల వల్ల ఇప్పుడు ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి రాకపోతే మళ్లీ మంచి పథకాలన్నీ అందకుండా పోతాయని జగన్ అన్నారు.
ఎన్నికల వేళ చంద్రబాబుకి సవాలు విసిరిన సీఎం జగన్