సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ వివాదం.. నెయ్యి కంటే పంది కొవ్వే రేటెక్కువన్న న్యాయవాది పొన్నవోలు..
దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

Ttd Laddu Controversy (Photo Credit : Google)
TTD Laddu Row : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం వ్యవహారం మరింత ముదిరింది. ఈ ఇష్యూ ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూ వివాదంపై విచారణ జరిపించాలని కోరుతూ పలువురు వ్యక్తులు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు పిటిషన్ వేశారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చాన్నారు. చంద్రబాబు వేసిన సిట్ లో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు వైవీ సుబ్బారెడ్డి. అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారాయన. వైసీపీపై సీఎం చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తన పిటిషన్ లో పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తరుపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరుపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
”దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కోర్టు వారు ఒక రిటైర్డ్ జడ్జితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ.. జడ్జి గారి ఆధ్వర్యంలో ఎక్స్ పర్ట్ కమిటీ వేసి ఇందులో నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నాం. నేనే కేసు పెట్టి నేనే జడ్జిని అయితే ఎలా.. చంద్రబాబు వ్యవహారం అచ్చం అలానే ఉంది. అది న్యాయసమ్మతం కాదు. లడ్డూ వివాదంపై సిట్ వేస్తామని చంద్రబాబు చెప్పడం పద్దతి కాదు. న్యాయ సమ్మతమూ కాదు. నేనే ఆరోపించి, నేనే శిక్ష వేస్తానంటే అది ధర్మం కాదు. మీకెందుకు భయం? మీకు ఇబ్బంది ఎందుకు? స్వతంత్ర ప్రతిపత్తి గత గౌరవ న్యాయమూర్తులతో విచారణ చేయిస్తాం.
ఎక్స్ పర్ట్ కమిటీతో ఎంక్వైరీ జరిపిస్తామంటే ఎందుకు వద్దంటున్నారు? అదే కరెక్ట్.. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా… నెయ్యి రేటు కంటే.. జంతువులు, పంది కొవ్వు ధరే ఎక్కువ. కొంతమంది వ్యక్తులు, ఒక వర్గం.. లడ్డూ వివాదాన్ని సృష్టించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కలుషితం చేయాలనే దుర్మార్గమైన ప్రయత్నం ఇది. మూడు టెస్టులు కాకుండా నెయ్యి లోపలికి వెళ్లదు. ఆ మూడు టెస్టుల్లో తక్కువ ఉందనే మేము వెనక్కి పంపించాము. దాన్ని మీరు మళ్లీ తీసుకుని టెస్టు చేస్తే ఎలా?” అని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
Also Read : ఆ వ్యక్తిని వదిలిపెట్టం..! శ్రీవారి ఆస్తుల అమ్మకంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
మొత్తంగా సుప్రీంకోర్టు జోక్యంతోనే లడ్డూ వివాదం వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కలుషితం అయ్యిందా లేదా? దీని వెనుక జరుగుతున్న ప్రచారం.. వీటన్నింటికి తెరదించాలంటే కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. కోర్టు పర్యవేక్షణలోనే కల్తీ నెయ్యి వివాదంపై విచారణ జరగాలంటూ వైవీ సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫుడ్ ఎక్స్ పర్ట్స్ నేతృత్వంలో ఈ ఎంక్వైరీ జరగాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.