ఆ వ్యక్తిని వదిలిపెట్టం..! శ్రీవారి ఆస్తుల అమ్మకంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించిందా? లేదా?

ఆ వ్యక్తిని వదిలిపెట్టం..! శ్రీవారి ఆస్తుల అమ్మకంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan On TTD Assets (Photo Credit : Google, Facebook)

Updated On : September 23, 2024 / 7:53 PM IST

TTD Assets : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. స్వామిపై విశ్వాసంతో భక్తులు ఆస్తులు ఇచ్చారని, వాటినే నిరర్ధక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించిందా? లేదా? అని ప్రశ్నించారు పవన్. టీటీడీ ఆస్తులను విక్రయించాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు పవన్ కల్యాణ్.

శ్రీవారి ఆస్తులకు సంబంధించి కీలక అంశాలతో కూడిన ఓ ప్రెస్ నోట్ ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందంటూ పెద్ద దుమారం రేగుతున్న వేళ.. తాజాగా పవన్ కల్యాణ్ మరికొన్ని సంచలన ఆరోపణలు గత ప్రభుత్వంపై చేయడం జరిగింది. శ్రీవారి ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ బయటపెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గతంలో భక్తులు స్వామివారికి ఇచ్చిన ఆస్తులను గత ప్రభుత్వంలోని పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని, ఆ ప్రయత్నాలు ఎంతవరకు వెళ్లాయి? ప్రస్తుతం ఆస్తులు ఏమున్నాయి? అలాగే శ్రీవారి ఆభరణాల సంగతి ఏంటి? ఈ వివరాలన్నీ తెలియాలన్నారు పవన్ కల్యాణ్.

భక్తుల నుంచి శ్రీవారికి పెద్ద మొత్తంలో బంగారం కానుకల రూపంలో వచ్చింది. వాటి లెక్కలన్నీ ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు సంబంధించి రక్షణ కల్పించిందా? లేదా? అన్న అంశంపై విచారణ జరిపించాలన్నారు. కచ్చితంగా ఆస్తులు, ఆభరణాలకు సంబంధించిన అంశంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. ముఖ్యంగా ఏపీతో పాటు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ శ్రీవారికి ఆస్తులు ఉన్నాయి. ముంబై, హైదరాబాద్ నగరాల్లోనూ విలువైన ఆస్తులు టీటీడీకి ఉన్న నేపథ్యంలో.. ఈ ఆస్తులకు సంబంధించి విక్రయాలు గత ప్రభుత్వ పాలకమండలిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం ఉంది.

తమిళనాడులో 23 ఆస్తులను వేలం పాట ద్వారా విక్రయించాలని, వాటి విలువ రూ.23 కోట్లుగా ఉందని గతంలో లెక్కించారు. అయితే, విక్రయాల ద్వారా 100 కోట్ల రూపాయలకుపైగా అప్పటి ప్రభుత్వం సమకూర్చుకుంది అనేది వార్తల ద్వారా తెలుస్తుందని పవన్ కల్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటు గుంటూరు, హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న ఖాళీ ప్రదేశాలు.. మల్కాజ్ గిరిలో ఉన్న అపార్ట్ మెంట్, బెంగళూరులో ఉన్న కొన్ని ఆస్తులు.. వీటన్నింటి గత ప్రభుత్వం వేలం వేసేందుకు నిర్ణయం తీసుకుందని, వేలం ప్ర్రక్రియ కూడా జరిగిందని, ఆ ఆస్తుల ద్వారా రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని గత ప్రభుత్వం సమకూర్చుకోవడానికి ప్రయత్నించిందని పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఏమైంది అనే దానిపై విచారణ చేయాలంటూ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అప్పట్లో స్వామి వారి దర్శనానికి ఒక వ్యక్తికి రూ.10వేల 500 వసూలు చేశారు. కానీ, రసీదు మాత్రం రూ.500కే ఇచ్చారని ఎన్నికలకు ముందు పవన్ అనేక సందర్భాల్లో ఆరోపించారు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని తెరపైకి తెచ్చారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయి? వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు? వాటి లెక్కలను కూడా బయటకు తీయాలని.. దానిపై విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read : మీరు మారరా? మాజీ సీఎం జగన్‌కు కేతిరెడ్డి ఇచ్చిన సలహాపై వైసీపీలో ఫైర్‌..!

టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తుల అమ్మకాలు చేపట్టారో.. వాటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి లెక్కలు బయటకు తీయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలి అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.