స్థానిక పోరులో చేతులేత్తేశారు.. వైసీపీకి సీట్లు అప్పగించారు!

  • Published By: sreehari ,Published On : March 18, 2020 / 09:35 AM IST
స్థానిక పోరులో చేతులేత్తేశారు.. వైసీపీకి సీట్లు అప్పగించారు!

Updated On : March 18, 2020 / 9:35 AM IST

టీడీపీలో దిగ్గజ నేతలుగా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేశారని పార్టీ కార్యకర్తలు ఫీలవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాలకు నియోజకవర్గాలే అధికారపక్షం పరం కావడంలో టీడీపీ నేతల హస్తం ఉందనే టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై తమ ప్రతాపాన్ని చూపించిన కొందరు టీడీపీ నేతలు.. ఇప్పుడు అవే పరిస్థితులు ఎదుర్కోవడంతో సైలెంట్‌ అయిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తిరగాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. కొందరు నేతలైతే తమ మకాం హైదరాబాద్‌కు మార్చేశారు. 

ఒక్క నామినేషన్ కూడా వేయలేదు :
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఊపు ఊపిన కేఈ కృష్ణమూర్తి, జేసీ దివాకర్‌రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, యరపతినేని శ్రీనివాసరావు, బొజ్జల కుటుంబం, కోడెల కుటుంబం, తదితర నేతలంతా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ముందు చేతులెత్తేశారు. సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఒక్కటంటే ఒక్క నామినేషన్‌ కూడా టీడీపీ తరఫున దాఖలు కాలేదు. మొన్నటి వరకు అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న సతీశ్‌రెడ్డి పార్టీ వీడటంతో ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. గెలుపు సంగతి తర్వాత సీఎం నియోజకవర్గంలో కనీసం పోటీలో కూడా లేకపోవడం అక్కడ టీడీపీ దుస్థితిని తెలియజేస్తోంది. 

కేడర్ రెడీగా ఉన్నా నేతలేరి? :
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున నాయకులే కనిపించడం లేదు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా మాజీ మంత్రి అమర్నాథరెడ్డి మరదలు అనీషారెడ్డి ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని పర్యవేక్షించేవారు. ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేయడానికి కేడర్ రెడీగా ఉన్నా వారికి అండగా ఉండే నాయకులు కరువయ్యారు. పుంగనూరులో జరిగినన్ని సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఒకటి అరా తప్పితే ఎక్కడ టీడీపీ నామినేషన్లు దాఖలు చేయలేకపోయింది. పలమనేరు, పుంగనూరులలో అమర్నాథ్‌రెడ్డి సరిగ్గా పట్టించుకోక పోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని కార్యకర్తలు వాపోతున్నారు.(అనంత టీడీపీలో ఆ రెండు వర్గాల మధ్య చిచ్చు)

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీకి గట్టి క్యాడర్ ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న బొజ్జల సుధీర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రేపు నామినేషన్ అనగా ఒక రోజు ముందు అడుగుపెట్టారు. ధైర్యం చేసి నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు సుధీర్ అండగా నిలవలేకపోయారు. కాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేయడం లేదంటూ హైదరాబాద్ చెక్కేశారు. కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న డోన్ నియోజకవర్గం కూడా అధికార పార్టీకి అప్పనంగా అప్పగించేశారు. ప్రస్తుతం అధికార పార్టీ ధాటికి పోటీ చేయలేక తామే వారికి దానం చేస్తున్నామని స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు కేఈ. 

అలాగే కేఈ ప్రాబల్యం ఉన్న పత్తికొండ నియోజకవర్గాన్ని సైతం వదిలేశారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ అధికార పార్టీతో పోరాడలేక కాంప్రమైజ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. బనగానపల్లె నియోజకవర్గంలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి సైతం అధికార పార్టీని ఎదిరించలేక పోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ కుటుంబం పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మొదట ఎన్నికల్లో పోటీ చేయబోమని స్టేట్‌మెంట్ ఇచ్చిన జేసీ… ఆ తర్వాత అభ్యర్థులను రంగంలోకి దింపారు. తర్వాత వారు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబం కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపలేకపోతోంది. ధర్మవరం బాధ్యతలు తీసుకున్న పరిటాల శ్రీరామ్ ఏ మాత్రం కేడర్‌కి ధైర్యం ఇవ్వలేకపోతున్నారు. చాలాచోట్ల నామినేషన్లు కూడా వేయలేకపోయారు. 

కేడర్ పట్టించుకునే నాయకుడే లేడా? :
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీ అధికారంలో ఉండగా పెత్తనం చేసిన యరపతినేని శ్రీనివాసరావు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులెత్తేశారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో తన గుత్తాధిపత్యాన్ని సాగించిన యరపతినేనిని ఎన్నికల అనంతరం అధికార పార్టీ టార్గెట్ చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో నరసరావుపేటలో హడావుడి చేసిన కోడెల కుటుంబం ఇప్పుడు దూరంగా ఉంటోంది. అక్కడ కూడా కేడర్‌ను పట్టించుకునే నాయకుడే లేరు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీ తరఫున నామినేషన్లు వేయలేని పరిస్థితి. మొత్తం మీద ఇన్నాళ్లూ తమకు తిరుగులేదని చెప్పుకొన్న నాయకులంతా పరోక్షంగా వైసీపీకి దాసోహమైపోయినట్టే కదా..