వైసీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ.. కారణం సీఎం జగనే అట, ఈ పరిణామం పార్టీకి మంచిది కాదంటున్న సీనియర్లు

cm jagan ysrcp : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వంపైనే దృష్టి పెడుతున్నారు. పాలనపై దృష్టి సారించిన ఆయన పార్టీ గురించి పెద్దగా ఆలోచించడం లేదంటున్నారు. ఈ పరిస్థితులపై పార్టీ నేతలతో పాటు, కార్యకర్తల్లో కూడా నిరాశ కనిపిస్తోంది. అంతే కాదు.. చాలా చోట్ల పార్టీలో నేతల మధ్య విభేదాలు, వర్గపోరు తీవ్రమవుతోందని అంటున్నారు. పార్టీని పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
తరుచూ నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం:
క్రమశిక్షణతో ఉండే పార్టీ మెల్లమెల్లగా గాడి తప్పుతోందని కార్యకర్తలు అనుకుంటున్నారు. చీటికీమాటకి నేతల మధ్య విభేదాలు, నేతల సమన్వయ లోపం తరచూ బయట పడుతున్నాయి. నేతల మధ్య విభేదాలతో పాటు పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలకు పని లేకుండా పోయిందని ఫీలైపోతున్నారు. ఏం చేయాలో తెలియక డీలా పడిపోతున్నారు. దీనికి తోడు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం సంగతి పక్కన పెడితే కనీసం కలవడానికి కూడా దొరకడం లేదంటున్నారు.