వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి, సీఎం జగన్ సంతాపం

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 08:53 AM IST
వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి, సీఎం జగన్ సంతాపం

Updated On : July 22, 2020 / 10:53 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రెడ్డి నాగభూషణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(జూలై 21,2020) రాత్రి తుదిశ్వాస విడిచారు. శాంతి-నాగభూషణరావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఎమ్మెల్యే భర్త మరణంతో కుటుంబంతో పాటు నియోజకవర్గంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీఎం జగన్ సంతాపం:
పార్లమెంటులో ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసి నాగభూషణరావు పదవీ విరమణ చేశారు. ఎమ్మెల్యే శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల సీఎం జగన్, వైసీపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా కీలక బాధ్యతలు:
నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా దేశంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజ‌ర్వేటర్‌గా, డామ‌న్ డ‌య్యూ టూరిజం డైర‌క్ట‌ర్‌గా, ప‌ర్యావ‌ర‌ణం, కాలుష్యం, అడ‌వులు, ఇంధన‌వ‌న‌రుల‌ శాఖ‌ల‌కు సంబంధించిన ప‌లు విభాగాల్లో ప‌ని చేశారు. ప‌లువురు కేంద్ర మంత్రుల దగ్గర ఓఎస్‌డీగా కూడా విధులు నిర్వర్తించారు. పార్ల‌మెంట్ డిప్యూటీ స్పీక‌ర్ దగ్గర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా చేస్తూ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. కొద్దికాలంగా కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. కేన్సర్‌ పూర్తిగా నయమయ్యాక కొద్ది నెలల క్రితం మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.