Rajahmundry Election Fight : సై అంటే సై.. భరత్ వర్సెస్ వాసు.. రాజమండ్రిలో యువనేతల మధ్య హోరాహోరీ పోరు

ఎంపీ భరత్‌ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే.. టీడీపీ కూడా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తోంది. అటు గంజాయి.. ఇటు అభివృద్ధి అంశాలే ఈ ఎన్నికల్లో..

Rajahmundry Election Fight : సై అంటే సై.. భరత్ వర్సెస్ వాసు.. రాజమండ్రిలో యువనేతల మధ్య హోరాహోరీ పోరు

Rajahmundry Election Fight : ఏపీ సాంస్కృతి రాజధాని.. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నగరం.. రాజమండ్రి నగరం…. ఘన చరిత్ర కలిగిన రాజమండ్రిలో రాజకీయం మాత్రం పూర్తిగా మారిపోయింది. గంజాయి, డ్రగ్స్‌, రౌడీలు, నేరగాళ్లకు అడ్డాగా… వారికి వెన్నుదన్నుగా రాజమండ్రి నేతలు నిలుస్తున్నారా? అనే సందేహాలే ఎక్కవవుతున్నాయి.

ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు… ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు యువనేతలు తెల్లవారి లేచిన నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఇవే ఆరోపణలతో దుమ్ము రేపుతున్నారు? ఇంతకీ రాజమండ్రి రాజకీయాల్లో ఏది నిజం..? గంజాయి, డ్రగ్స్‌తో రాజకీయం భ్రష్టుపడుతోందా? గంజాయి ముఠాలతో లింకులున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదా?

ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి..
రాజమండ్రి రాజకీయం మంచి కాకమీద కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తరఫున యువనేతలే తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు సిట్టింగ్‌ ఎంపీ మార్గాని భరత్‌ అధికార వైసీపీ అభ్యర్థి కాగా, మరొకరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు టీడీపీ అభ్యర్థి. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్‌ ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఈయనకు దీటైన అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసుకి టికెట్‌ ఇచ్చింది టీడీపీ.

గంజాయి కేసులే ఆధారంగా తీవ్ర ఆరోపణలు..
ఇద్దరు యువనేతల మధ్య ఆధిపత్య పోరాటం పీక్‌ లెవెల్‌లో కొనసాగుతోంది. ఢీ అంటే అన్నట్లు ఇద్దరూ ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్ము రేపుతున్నారు. గంజాయి కేసులే ఆధారంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అసలు రాజకీయాలకు.. గంజాయి బ్యాచ్‌కు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయోగాని.. ఇరువురు నేతల కామెంట్లు మాత్రం కాకరేపుతున్నాయి.

టీడీపీ కంచుకోటలో గెలుపే టార్గెట్ గా..
టీడీపీకి కంచుకోట అయిన రాజమండ్రి నగరంలో ఎలాగైనా గెలవాలనే టార్గెట్‌తో దూసుకుపోతున్నారు ఎంపీ భరత్‌. గత ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులను చూపి ఓట్లు అడుగుతున్నారు. 16 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న ఆదిరెడ్డి కుటుంబం ఏం చేసిందని నిలదీస్తున్నారు ఎంపీ భరత్‌. ఇక టీడీపీ కూడా కంచుకోటను కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఎంపీ భరత్‌ టార్గెట్‌గా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. కమీషన్ల కోసమే ఎంపీ పని చేస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అభ్యర్థి వాసు.

ఫ్యాన్‌ తుఫాన్‌ను తట్టుకుని భారీ మెజార్టీతో విజయం..
మొత్తానికి ఇద్దరు యువనేతల రాజకీయం రాజమండ్రిలో కొత్త సమీకరణలకు తెరలేపుతోంది. ఒకప్పుడు సంస్కృతీ, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిన రాజమహేంద్రిలో రాజకీయం హైటెన్షన్‌గా మారడం.. ఎన్నికల ఫలితంపైనా ఉత్కంఠ పెంచేస్తోంది. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ దాదాపు 30వేల మెజార్టీ సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ తుఫాన్‌ను తట్టుకుని భారీ మెజార్టీతో భవానీ గెలుపొందడాన్ని చాలెంజింగ్‌ తీసుకుంటోంది వైసీపీ. ఈసారి టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి నీలిజెండాను ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది.

ముందునుంచే రాజమండ్రి సిటీపై భరత్ గురి..
గెలుపే టార్గెట్‌గా రంగంలోకి దిగుతున్న వైసీపీ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఎంపీ భరత్‌ను పోటీకి పెట్టింది. ఎంపీ భరత్‌ కూడా చాలా కాలం ముందునుంచే రాజమండ్రి సిటీపై గురిపెట్టారు. పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటూ ప్రజల్లో పరపతి పెంచుకునేలా అడుగులు వేశారు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి, రచ్చబండ వంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, విమానాశ్రయ అభివృద్ధి, మోరంపుడి ఫ్లై ఓవర్ పనుల ద్వారా… ఎంపీగా తాను చేసిన కృషిని గుర్తించాలని కోరుతున్నారు.

అటు గంజాయి.. ఇటు అభివృద్ధి..
ఇక టీడీపీ కూడా భరత్‌ స్పీడ్‌కు బ్రేకులు వేసేలా పనిచేస్తోంది. ఎంపీ ఆరోపణలకు దీటుగా సమాధానమిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, ఇబ్బందులు సృష్టించారని ప్రజల్లో సానుభూతి రగిలిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీకి రెట్టింపు ఇవ్వాలని కోరుతోంది. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయంగా కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ భరత్‌ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే.. టీడీపీ కూడా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తోంది. అటు గంజాయి.. ఇటు అభివృద్ధి అంశాలే ఈ ఎన్నికల అజెండాను మార్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరు యువనాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఐతే ఇద్దరి చుట్టూ చేరిన గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు మాత్రం ఎన్నికల్లో నేతల తలరాతలను మార్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

Also Read : అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్‌ సీటు