ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.

Postal Ballot Votes Counting : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద గొడవే నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ను ఎవరైతే ఉపయోగించుకున్నారో చిన్న చిన్న తప్పులు ఉన్నా వాటిని పరిగణలోకి తీసుకోవద్దని సీఈవో మీనా మెమో ఇచ్చారు. ఈ మెమోపై వైసీపీ అభ్యంతరం తెలుపుతోంది. సంతకాలు, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం, సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ కరెక్ట్ గా ఉందా లేదా? సంతకం కరెక్ట్ గా ఉందా లేదా? వీటన్నింటిని పరిశీలించాలని.. దాని
వల్ల ఓటు పర్సంటేజ్ కూడా పెంచినట్లు ఉంటుందని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
అయితే, ఈ వ్యవహారంపై మొదటి నుంచి కూడా వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల కౌంటింగ్ హాల్ లో ఏజెంట్ల మధ్య గొడవలకు దారితీసే అవకాశం ఉందని, అంతేకాకుండా గతంలో ఉన్న ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన నిబంధనలు కొనసాగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తోంది. ఈ విషయమై పలుమార్లు సీఈవోని వైసీపీ నాయకులు కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు కూడా రాశారు. తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఈ ఎన్నికల్లో చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఓ పార్టీ చాలా నమ్మకాలు పెట్టుకుంది. మరో పార్టీ తగ్గిస్తే మేలు అనే ఉద్దేశంతో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా టీడీపీకి పడ్డాయి అనే అనుమానం వైసీపీలో ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో గట్టిగా ఉండాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఈ విషయంలో ఏపీ సీఈవో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాసినా, మెయిల్ చేసినా పట్టించుకోని నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించింది వైసీపీ.
Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..