బృహస్పతి అమృతంతో అభిషేకించిన మాధవేశ్వరీ దేవి.. విగ్రహారాధనలేని శక్తి పీఠం

ఈ శక్తివంతమైన పీఠంలో విగ్రహారాధన ఉండదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠం ఇది.

బృహస్పతి అమృతంతో అభిషేకించిన మాధవేశ్వరీ దేవి.. విగ్రహారాధనలేని శక్తి పీఠం

Madhaveswari Devi

Updated On : September 16, 2025 / 5:22 PM IST

Madhaveswari devi Shakthi Peetham: ఆదిపరాశక్తి మాధవేశ్వరీ దేవి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో వెలసింది. దక్షయజ్ఞం తర్వాత అమ్మవారి కుడిచేతి వేళ్లు పడిన ప్రాంతం ఇది. ఈ దేవతను బృహస్పతి అమృతంతో అభిషేకిస్తాడు. దీంతో ఈ ప్రదేశానికి అమృత తీర్థం అనే పేరు ఉంది.

విగ్రహమేలేని ఆలయం ఇది. ఈ శక్తివంతమైన పీఠంలో విగ్రహారాధన ఉండదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠం ఇది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భక్తులు పూజిస్తారు. 4 దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. (Madhaveswari devi Shakthi Peetham)

దానిమీద వస్త్రాన్ని హుండీలా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలుచుకున్నట్లుగా భావిస్తారు. కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు. ఇలా విగ్రహారాధన లేని శక్తి పీఠం భారత దేశంలో ఈ క్షేత్రం ఒక్కటే.

సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమని కూడా వ్యవహరిస్తారు. శ్రీరామ చంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన తమ్ముడైన లక్ష్మణుడు, భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడు రాముడు. అదే సమయంలో ఈ మాతను కొలిచాడని చెబుతారు.

మరో జానపద కథనం కూడా ఈ క్షేత్రానికి ఉంది. పూర్వం ఈ ప్రాంతమంతా ఓ దట్టమైన అరణ్య ప్రదేశంగా ఉండేది. అలోపి అనే రాణి పెళ్లి చేసుకొని ఈ మార్గంలోనే అత్తవారింటికి కాపురానికి వెళ్తూ ఉంటుంది.

ఆమె ప్రయాణిస్తున్న పల్లకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడి ముఠా ఈ బృందంపై దాడి చేసి దోచుకుంటుంది. అప్పుడు పెళ్ళికూతురు అయిన రాణి.. అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. ఆనాటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా పిలుస్తున్నారు.

గంగా, యుయున, సరస్వతి నదుల కూడలి ప్రదేశమే ప్రయాగ. మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రయాగను అలహాబాద్ గా పేరు మార్చారు. ఈ మూడు నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. ఇక్కడ వెలిసిన మాధవేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు.