Ratha Saptami 2025 : రథ సప్తమి రోజున సూర్యుడు ఏడు గుర్రాలపై ఎందుకు వస్తాడు? శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత ఏంటి?

Ratha Saptami 2025 : సూర్యుడికి ఏడు గుర్రాలు 7 వారాలకు చిహ్నాలుగా చెబుతారు. ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులుగా పిలుస్తారు. పూజా విధానం, పండుగ ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ratha Saptami 2025 : రథ సప్తమి రోజున సూర్యుడు ఏడు గుర్రాలపై ఎందుకు వస్తాడు? శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత ఏంటి?

Ratha Saptami 2025 to Be Observed on 4th February

Updated On : February 4, 2025 / 1:31 PM IST

Ratha Saptami 2025 : హిందూపురాణాల్లో రథ సప్తమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. రథ సప్తమినే ఆరోగ్య సప్తమిగా పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున సూర్యుడి జన్మదినంగా చెబుతారు.
ఈ రోజున సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ప్రయాణం మొదలుపెడతాడు. దక్షిణాయనం నుంచి ఉత్తర దిశలో సూర్యుడు ప్రయాణం కొనసాగిస్తాడని మహా పండితులు చెబుతుంటారు. ఈ రథ సప్తమి రోజున సూర్య దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తుంటారు.

ఇలా పూజలు చేస్తే ఏడు జన్మల పాపాలు నశించిపోతాయని విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం.. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించాలి. పలు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

Read Also : World Cancer Day 2025 : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి.. ప్రధాన కారణాలు? నివారణ మార్గాలేంటి?

మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి నాడు సూర్యున్ని పూజిస్తే.. ఆర్థికంగా అనేక లాభాలను పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. 2025 ఏడాది రథ సప్తమి ఫిబ్రవరి 4న వచ్చింది. అయితే, రథ సప్తమి శుభసమయం, పూజా విధానం, పండుగ ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడు గుర్రాలు దేనికి సంకేతం :
సూర్యుడికి ఏడు గుర్రాలు 7 వారాలకు చిహ్నాలుగా చెబుతారు. ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులుగా పిలుస్తారు. త్రిష్ణుప్, పంక్తి, జగతి అనుష్టుప్, గాయత్రి, ఉష్ణిక్, బృహతి అనే 7 గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తాడు.

మేష రాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల్లో సూర్యుడు ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేసేందుకు సూర్యుడికి ఏడాది సమయం అవుతుంది. సూర్య జయంతి అనగా సూర్యుడి పుట్టినరోజు కాదు.. సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణాన్నే రథసప్తమిగా పిలుస్తారు. అది నేటి నుంచే ప్రారంభమవుతుంది.

రథసప్తమి శుభ ముహుర్తం :
పంచాంగం ప్రకారం.. మాఘ మాస సప్తమి తిథి, శుక్ల పక్షం ఫిబ్రవరి 4న ఉదయం 4:37 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 5న తెల్లవారుజామున 2:30 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో సూర్యోదయ సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రథ సప్తమిని 2025 ఫిబ్రవరి 4న జరుపుకుంటారు.

బ్రహ్మ ముహూర్తం : ఉదయం 5:23 నుంచి 6:15 వరకు
అమృత్ కాలం : మధ్యాహ్నం 3:03 నుంచి సాయంత్రం 4:34 వరకు
అభిజిత్ ముహూర్తం : మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 12:57 వరకు
విజయ్ ముహూర్తం : మధ్యాహ్నం 2:24 నుంచి సాయంత్రం 3:08 వరకు

ఈ రోజున పవిత్ర స్నానానికి ఉత్తమ సమయం ఉదయం 5:23 నుంచి 7:08 వరకు ఉంటుంది. స్నానం చేసిన తర్వాత భక్తులు సూర్యదేవుడికి ప్రార్థనలు చేసి, పేదలకు ఆహారం, డబ్బును దానం చేయాలి.

రథ సప్తమి ప్రాముఖ్యత :
పురాణాల ప్రకారం.. కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యుడు జన్మించాడు. సూర్యుడి పుట్టినరోజునే రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ పరమ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేస్తే విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు.. తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచి నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

పూజా విధానం :
రథసప్తమి నాడు స్నానం చేసిన తర్వాత సూర్య కిరణాలు పడే చోట ముగ్గులు వేసి సూర్యుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచాలి. సూర్యుని చిత్ర పటానికి కుంకుమ, గంధం పెట్టాలి. ఎరుపు రంగు పువ్వులతో అలంకరించి పూజించాలి. బెల్లం, నువ్వులు కలిపి సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించండి. కొబ్బరి పుల్లల సాయంతో చిన్న రథాన్ని చేసి పూజ చేయాలి. ఆపై ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ మంత్రాన్ని పఠించండి : 
సూర్యోదయం సమయంలో సూర్యదేవున్ని జపిస్తూ స్నానం చేయాలి.
‘‘ఓం సూర్యాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం మార్తాండ నమః’’ అనే మంత్రాలను జపిస్తుండాలి.

Read Also : World Cancer Day 2025 : ప్రతి ఏడాది ఫిబ్రవరి 4నే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎప్పుడు ప్రారంభమైంది, చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి?

రథ సప్తమి రోజున పాటించాల్సిన ఆచారాలివే :
సూర్య దేవుడికి ఎర్ర చందనం, ఎర్రటి పువ్వులు, బెల్లం కలిపి అర్ఘ్యం సమర్పించండి. శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఇలా చేస్తే సామాజిక హోదాతో పాటు లక్ష్యాలను సాధించవచ్చు. మీ జాతకంలో సూర్యుని స్థానం బలంగా మారేందుకు రథ సప్తమి నాడు ఎర్ర చందనం, గంగా జలం, కుంకుమ లేదా ఎర్రటి పువ్వులతో నీటిలో కలిపి స్నానం చేయండి. సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించండి.

ఈ ఆచారంతో శ్రేయస్సు, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ ఆచారాలను భక్తితో పాటించడం ద్వారా సంపన్నమైన, సంతృప్తికరమైన జీవితం కోసం సూర్యదేవుని ఆశీర్వాదాలను పొందవచ్చు.