Vijaya Ekadasi 2026: ఫిబ్రవరి 13.. విజయ ఏకాదశి.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఇలా చేస్తే తిరుగు లేదంతే..!
స్కాంద పురాణంలో చెప్పినట్లు విజయ ఏకాదశి రోజున పూజ చేస్తే మీకు సంవత్సరం పాటు ఏ పని ప్రారంభించినా విజయం తధ్యం.
Vijaya Ekadasi 2026 Representative Image (Image Credit To Original Source)
- మాఘ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిధి విజయ ఏకాదశి
- ఏకాదశి రోజున పూజ చేస్తే ఏడాది మొత్తం విజయాలే
- ఏకాదశి అంతా అన్నం తినకుండా ఉండాలి
Vijaya Ekadasi 2026: విజయ ఏకాదశి ప్రాధాన్యత ఏంటి, విజయ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందో, కార్యసిద్ధి ఏర్పడుతుందో, విజయ ఏకాదశి వెనుకున్న పురాణ రహస్యాలు ఏంటో, విజయ ఏకాదశి రోజున ఎటువంటి దానాలు ఇవ్వడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం.
మాఘ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిధిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి విజయ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రోజున ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కచ్చితంగా విజయమే వరిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది.
ఏకాదశి వ్రతం అంటే పగలు ఉపవాసం ఉండటం (పాలు, పండ్లు స్వీకరించటం) రాత్రికి విష్ణుమూర్తిని స్మరించుకుని మర్నాడు ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవడం. స్వయంగా శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి అవతారం అయినా ఆయన కూడా సీతమ్మ అన్వేషణలో రావణుడి మీద విజయం సాధించేందుకు ఈ ఏకాదశి వ్రతం చేశారని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం చేయగానే సేతువు నిర్మాణానికి సంబంధించిన ఆలోచన మెదిలి, వానరుల సాయంతో సేతువు నిర్మాణం జరిగి, ఆ సేతువు మీద వెళ్లి లంకా నగరం చేరుకుని రావణుడి మీద విజయం సాధించాడు. అందుకే దీనికి విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇది విజయ ఏకాదశి వెనుకున్న పురాణ గాథ.
విజయ ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి?
స్కాంద పురాణంలో చెప్పినట్లు విజయ ఏకాదశి రోజున పూజ చేస్తే మీకు సంవత్సరం పాటు ఏ పని ప్రారంభించినా విజయం తధ్యం. ఒక కుండ లేదా పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రలో నీళ్లు పోయాలి. దాని చుట్టూ మామిడి ఆకులు అలంకరణ చేయాలి. పలు రకాల పుష్పాలు, అక్షితలు వేయండి. దాన్ని పూజ గదిలో ఉంచాలి. పక్కనే లక్ష్మీనారాయణుల ఫోటో లేదా విష్ణు సంబంధమైన ఫోటో పెట్టాలి. దానికి పంచోపచార పూజ చేయాలి. గంధం, పుష్పం, దూపం, దీపం, నైవేద్యం ఈ ఐదు సమర్పిస్తే పంచోపచార పూజ అంటారు. అలా పూజ చేశాక ఏకాదశి మరునాడు నది దగ్గర లేదా చెరువు దగ్గర లేదా దేవాలయ ప్రాంగణంలో కుండ లేదా పాత్రతో పాటు ఫోటోని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి.
చేయాల్సిన దానాలు..
వస్త్ర దానం
గొడుగు దానం
పాదరక్షలు దానం
ధాన్యం దానం
వీటిలో ఏ దానం ఇచ్చినా విశేషమైన ప్రయోజనాలు, సమస్త శుభాలు కలుగుతాయి.
ఏకాదశికి అద్భుతమైన ప్రాధాన్యత..
పౌర్ణమికి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ 11వ రోజున ఏకాదశి వస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను దాటి విష్ణుమూర్తిని చేరాలి అని చెప్పటమే ఏకాదశిలో ఉన్న అంతరార్థం.
ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదు..
బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం చేస్తూ అలసిపోతే ఆయనకు చెమట వచ్చింది. ఆ చెమట జారి అందులోంచి ఒక జీవి పుట్టింది. ఒక చెడు శక్తి పుట్టుకొచ్చింది. ఆ చెడు శక్తి జీవి నేను ఎక్కడుండాలి అని బ్రహ్మ దేవుడిని అడిగితే.. ఏకాదశి రోజున నువ్వు అన్నంలో ఉండు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ జీవి అన్నంలో ఉండటం ప్రారంభించింది. అందుకే ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని పురాణాల్లో చెప్పారు. ఇందులో సైన్స్ కూడా ఉంది. ఏకాదశి రోజున అన్నం తినకుండా రోజంతా ఉపవాసం ఉంటే మరనాడు ద్వాదశి రోజు పారణ చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. పారణ అంటే ద్వాదశి ఘడియలు ఉండగానే ఏదో ఒక ఆహారం తినాలి. ఏకాదశి అంతా పాలు, పండ్లు తీసుకుంటూ అన్నం తినకుండా ఉండాలి. ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు ఉన్న సమయంలో ఏదో ఒక ఆహారంగా తినాలి.
విజయ ఏకాదశి రోజున అందరూ కూడా ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సంబంధమైన స్తోత్రాలు విష్ణు సహస్ర నామ స్తోత్రం, విష్ణు పంజర స్తోత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి వినటం లేదా చదవటం చేయాలి.
ఏకాదశి రోజున అస్సలు చేయకూడని తప్పులు..
* హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు
* షేవింగ్ చేయించుకోరాదు
* గోర్లు కత్తిరించుకోరాదు
ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి, దైవానుగ్రహాన్ని తగ్గిస్తుంది.
* అభ్యంగన స్నానం (ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటు స్నానం చేయడం) చేయకూడదు
* తలంటు స్నానం చేయకూడదు
ఏకాదశి రోజున మృతికా స్నానం చేస్తే జీవితంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి. అందులో విజయ ఏకాదశి రోజున మృతికా స్నానం చేస్తే బ్రహ్మాండమైన, తిరుగులేని అద్భుత, శుభ ఫలితాలు కలుగుతాయి. మృతికా స్నానం అంటే.. నువ్వుల పిండి, గోమయం, మట్టి ఈ మూడు కలిపి శరీరానికి రాసుకుని స్నానం చేస్తే దాన్ని మృతికా స్నానం అంటారు. నువ్వుల పిండిలో కొద్దిగా గోమయం(ఆవు పేడ) కలిపి, మట్టి కొంచెం కలిపి ఈ మూడింటి మిశ్రమాన్ని కొద్దిగా శరీరానికి రాసుకుని స్నానం చేయాలి.
