Pasankusa Ekadashi: అక్టోబర్ 3.. పాశాంకుశ ఏకాదశి.. చేయాల్సిన పూజ, కలిగే శుభాలు..
ఇలా ఆలయానికి సంబంధించి పూజలు చేస్తే శ్రీ మహా విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతీ ఒక్కరు పాత్రులు కావొచ్చు.

Pasankusa Ekadashi: పాశాంకుశ ఏకాదశి అంటే ఏమిటి? ఎప్పుడు వచ్చింది? ఈ రోజు ఎందుకు అంత ప్రత్యేకం? ఏ దేవుడిని పూజించాలా, ఎలా పూజ చేయాలి, కలిగే శుభ ఫలితాలు ఏంటి? పండితుల మాటల్లో తెలుసుకుందాం..
ఆశ్వీజ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాశాంకుశ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు పాశము, అంకుశము ధరించి భక్తులకు ఒక రక్షణ లాగా నిలబడేటటువంటి ఏకాదశి.. పాశాంకుశ ఏకాదశి. పాశాంకుశ ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజిస్తే ఆయన భక్తులందరినీ కూడా ఒక అంకుశం ధరించి రక్షిస్తాడని నమ్మకం. అందుకే దీన్ని పాశాంకుశ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన ఏకాదశి. అక్టోబర్ 3న వచ్చింది.
ఈ పాశాంకుశ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించాలంటే, విష్ణు శక్తి మిమ్మల్ని కాపాడాలంటే దగ్గరలో ఉన్న విష్ణు సంబంధ ఆలయానికి వెళ్లి సరి సంఖ్యలో ప్రదక్షణలు చేయండి. ధ్వజ స్తంభం దగ్గర దీపం పెట్టండి. ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయండి. విష్ణువు ఆలయంలో భక్తులకు జలదానం చేయండి. విష్ణు ఆలయంలో భక్తులకు గంధం కానీ వెన్నపూస కానీ ఇవ్వండి. వీటి వల్ల సమస్త శుభాలు చేకూరతాయి.
లేదా విష్ణు ఆలయంలో సమార్చన చేయాలి. అంటే ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, ముగ్గురు వేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం. ఇలా ఆలయానికి సంబంధించి పూజలు చేస్తే శ్రీ మహా విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతీ ఒక్కరు పాత్రులు కావొచ్చు.
అలాగే ఈ పాశాంకుశ ఏకాదశి రోజున ఇంట్లో కూడా విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహ స్వామి, వేంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటోలకి గంధం, కుంకుమ బొట్లు అలంకరించి, ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ… ఈ రెండు మంత్రాలు అష్టాక్షరి, ద్వాదశాక్షరి వీలైనన్ని సార్లు చదువుకోవాలి. పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వటం, పచ్చ కర్పూరం కలిపిన తీపి పదార్ధాలు నైవేద్యం పెట్టడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని చదవాలి లేదా వినాలి. దీని వల్ల విష్ణు మూర్తి అంకుశం ధరించి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నింటి నుంచి సులభంగా బయటపడొచ్చు.
Also Read: వివిధ రకాల కాలసర్పయోగములు ఇవే.. వాటి ఫలితాలను తట్టుకోలేరు..