Kaal Sarp Dosh: వివిధ రకాల కాలసర్పయోగములు ఇవే.. వాటి ఫలితాలను తట్టుకోలేరు..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Kaal Sarp Dosh: వివిధ రకాల కాలసర్పయోగములు ఇవే.. వాటి ఫలితాలను తట్టుకోలేరు..

Kaal Sarp Dosh

Updated On : October 1, 2025 / 10:25 PM IST

Kaal Sarp Dosh: జాతక చక్రంలో రాహు కేతువుల మధ్య మిగతా గ్రహాలు ఉంటే దానిని కాలసర్పయోగముగా నిర్వచిస్తారు. ఈ సర్పయోగము వల్ల జీవితంలో దుష్పలితాలు అనుభవించక తప్పదు.

వివిధ రకాల కాలసర్పయోగములు, వాటి ఫలితాలు ఇవే..

అనంత కాలసర్పయోగము
జన్మలగ్నం నుంచి సప్తమ స్థానం వరకు లేక తను భావము నుంచి కళఉ్రత భావం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య మిగతా గ్రహములు ఉంటే దానిని అనంత కాలసర్పయోగము అంటారు. జన్మ లగ్నంలో రాహువు ఏడవ స్థానంలో కేతువు ఉండాలి.

ఫలితము: అనంత కాలసర్పయోగము వల్ల వైవాహిక జీవితంలో అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడం, అనారోగ్య సమస్యలు వ్యాపారములో నష్టాలు కలుగుతాయి.

కులిక లేక గుళికా కాలసర్పయోగము
జన్మలగ్నాత్ ద్వితీయ స్థానం నుంచి అష్టమ స్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్తగ్రహములు ఉంటే దానిని కులిక లేక గుళిక కాలసర్పయోగము అంటారు. రెండవ స్థానంలో రాహువు, ఎనిమిదవ స్థానంలో కేతువు ఉండాలి.

ఫలితము: గుళికా కాలసర్పయోగము వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు, అనారోగ్యము, పరస్త్రీలతో సంబంధం, సంతాన సుఖం ఉండకపోవడం, మిత్రుల విరోధములు కలుగుతాయి.

వాసుకి కాలసర్పయోగము 
జన్మలగ్నాత్ తృతీయ స్థానం నుంచి నవమ స్థానం వరకు రాహువు కేవువు గ్రహముల మధ్య సప్తగ్రహములు ఉంటే దానిని వాసుకి కాలసర్పయోగం అంటారు. మూడవ స్థానంలో రాహువు తొమ్మిదవస్థానంలో కేతువు ఉండాలి.

ఫలితము: వాసుకి కాలసర్పయోగము వల్ల సోదరులు, బంధువులతో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగములో బాధలు, పదోన్నతిలో ఆటంకములు, ఉద్యోగములు ఊడుట, గృహస్థు జీవనములో కాఠిన్యత, నాస్థికత్వము వంటి సమస్యలు వస్తాయి.

శంఖపాల కాలసర్పయోగము 
జన్మలగ్నాత్ చతుర్థ స్థానం నుంచి దశమ స్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని శంఖపాల కాలసర్పయోగము అంటారు. నాలుగో స్థానంలో రాహువు, పదవ స్థానంలో కేతువు ఉండాలి.

ఫలితము: శంఖపాల కాలసర్పయోగము వల్ల తల్లి లేక తండ్రి ద్వారా తీవ్ర వేదన గృహ, వాహన సమస్యలు అనారోగ్యము, విద్యలో ఆటంకములు ఉద్యోగ ములో వ్యాపారములలో లాభం లేకపోవడం వంటివి చోటుచేసుకుంటాయి.

పద్మ కాలసర్పయోగము
జన్మలగ్నాత్ పంచమ స్థానం నుంచి ఏకాదశ స్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని పద్మ కాలసర్పయోగము అంటారు. ఐదవ స్థానంలో రాహువు పదకొండవ స్థానంలో కేతువు ఉంటారు.

ఫలితము: పద్మ కాలసర్పయోగము వల్ల సంతానము వల్ల బాధలు లేక సంతానం లేకపోవుట విచిత్రమైన వ్యాధులు రావడం వ్యసనముల వల్ల భారీ నష్టములు, భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తుట, ధనము ఖర్చు కావడం, శత్రువుల వల్ల కష్టములు, జైళ్లలో ఉండవలసిన పరిస్థితి కలుగును. బాల్యం నుంచే బాధలు కలుగుతాయి.

మహా పద్మకాలసర్పయోగము
జన్మలగ్నాత్ షష్ఠమ స్థానం నుంచి ద్వాదశ స్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్తగ్రహములు ఉంటే దానిని మహా పద్మ కాలసర్పయోగము అంటారు. ఆరవ స్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఉంటారు.

ఫలితము: మహా పద్మకాలసర్పయోగము వలన శత్రువుల వల్ల సమస్యలు భార్య అనుకూలత లేకపోవడం (లేక) భర్త అనుకూలత లేకపోవడం జీవితాంతము రోగముల వల్ల బాధ నిరాశ ఎక్కువగా ఉంటాయి. ప్రేమాభిమానాలు లేకపోవడం, వృద్ధాప్యంలో కష్టములు కలగటం శత్రువులతో పోరాడటం వంటి సమస్యలు ఉంటాయి. గృహములో అసంతృప్తి ఉంటుంది.

తక్షక కాల సర్పయోగము
జన్మలగ్నాత్ సప్తమ స్థానంనుంచి లగ్నం వరకు లేక కళత్ర భావం నుంచి తను భావంవరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని తక్షక కాల సర్ప యోగము అంటారు. ఏడవ స్థానంలో రాహువు జన్మ లగ్నంలో కేతువు ఉంటారు.

ఫలితము: తక్షక కాలసర్పయోగము వల్ల ధన నష్టం వ్యాపారంలో చిక్కులు, పిత్రార్జితమును ఖర్చుచేయుట, పుత్ర సంతానం లేదని బాధపడుట, జీవిత భాగస్వామితో సమస్యలు వ్యసనముల, పర స్త్రీ సంగమము, శతృపీడ అనారోగ్యములు కలుగుతాయి.

కర్కోటక కాలసర్పయోగము 
జన్మలగ్నాత్ అష్ఠమ స్థానం నుంచి ద్వితీయ స్థానం వరకు లేక ఆయుర్ధాయ భావం నుంచి ధనభావం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్తగ్రహములు ఉంటే దానిని కర్కోటక కాలసర్పయోగము అంటారు. ఎనిమిదవ స్థానంలో రాహువు రెండవ స్థానంలో కేతువు ఉంటారు.

ఫలితము: కర్కోటక కాల సర్పయోగము వల్ల ప్రమాదాలు జరగడం, వివాహ జీవితంలో అశాంతి కారణమైన వాతావరణం అకాల మరణం మోసాలకు గురి అవుతారు. దీర్ఘకాల రోగములు, శస్త్రచికిత్సలు, ఎంత కష్టపడినా ఫలితం లభించదు. జీవితంలో అన్ని ఆలస్యంగా జరుగుతాయి. మంచి ఉద్యోగము దొరకడానికి చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. విపరీత ధననష్టం కలుగుతుంది.

శంఖచూడ లేక శంఖ నంద కాలసర్పయోగం
జన్మలగ్నాత్ నవమ స్థానం నుంచి తృతీయ స్థానం వరకు లేక భాగ్యస్థానం నుంచి భ్రాతృస్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని శంఖచూడ లేక శంఖనంద కాలసర్పయోగము అంటారు. తొమ్మిదవ స్థానంలో రాహువు మూడవస్థానంలో కేతువు ఉంటారు.

ఫలితము: శంఖచూడ కాలసర్పయోగము వల్ల దేవుడి మీద భక్తి లేకపోవుడం, పెద్దలంటే గౌరవం లేకపోవడం, వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయములో అధికంగా శ్రమించినా నష్టములు కలుగుతాయి. అవమానములు, గృహములో బాధలు, అసంతృప్తి ఉంటాయి. తండ్రి, గురువులతో విరోధములు ఉంటాయి.

ఘటక లేక పాతక కాలసర్పయోగము
జన్మలగ్నాత్ దశమ స్థానం నుంచి చతుర్ధ స్థానం వరకు లేక రాజ్య భావం నుంచి మాతృ భావం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని ఘటక లేక పాతక కాల సర్పయోగము అంటారు. పదవ స్థానంలో రాహువు నాల్గవ స్థానంలో కేతువు ఉంటారు.

ఫలితము: ఘటక లేక పాతక కాలసర్పయోగము వలన వ్యాపారములో మిత్రద్రోహం ఉద్యోగంలో అసంతృప్తి, వ్యాపార లావాదేవులలో నష్టం, తల్లి దండ్రులకు దూరంగా నివాసము చేయుట, సంతాన దోషములు.

విషక్త లేక విషదాన కాలసర్పయోగము
జన్మలగ్నాత్ ఏకాదశ స్థానం నుంచి పంచమ స్థానం వరకు లేక లాభస్థానం నుంచి పుత్రస్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని విషక్త కాలసర్పయోగము అంటారు. పదకొండవ స్థానంలో రాహువు ఐదవ స్థానంలో కేతువు ఉంటుంది.

ఫలితము: విషక్త కాలసర్పయోగము వల్ల వ్యాపారంలో చిక్కులు, నేత్ర, చెవి సంబంధ రోగములు, సోదరులు, మిత్రులతో వివాదాలు గృహాన్ని విడిచి పరదేశంలో నివసించడం, కోర్టు వ్యవహారాల్లో తలదూర్చటం, రహస్యమైన విషయాలు గోప్యంగా ఉంచటం జరుగుతాయి.

శేష నాగ కాలసర్పయోగము
జన్మలగ్నాత్ ద్వాదశ స్థానం నుంచి షష్ఠమ స్థానం వరకు లేక వ్యయస్థానం నుంచి శత్రుస్థానం వరకు రాహువు, కేతువు గ్రహముల మధ్య సప్త గ్రహములు ఉంటే దానిని శేష నాగ కాలసర్పయోగము అంటారు. పన్నెండవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో కేతువు ఉంటుంది.

ఫలితము: శేషనాగ కాలసర్పయోగము వల్ల శత్రువుల పీడ, అనారోగ్యము, కోర్టు వివాదాలు అవమానాలు ప్రాణభయం అధిక ఖర్చులు అవుతాయి. (Kaal Sarp Dosh)

BrahmaSRI DR Nayakanti Mallikarjuna Sharma

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956