కృష్ణ పట్నం పోర్టులో 75శాతం వాటా కొననున్న అదానీ పోర్ట్స్

బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ మొత్తంలో కృష్ణపట్నం పోర్టు నుంచి వాటాను కొనుగోలు చేయనుంది. హైదరాబాద్ ఆధారిత CVR గ్రూపు నుంచి కృష్ణ పట్నం పోర్టు కంపెనీ (KPCL)లో 75శాతం వాటాను పొందాలని భావిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత షేర్ హోల్డర్ల నుంచి కృష్ణ పట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ నుంచి రూ.13వేల 572 కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బాంబే స్టాక్ ఎక్సేంజీ దాఖలులో కంపెనీ పేర్కొంది.
అదానీ పోర్ట్స్ కంపెనీలోని వ్యాపారాల్లో KPCL కంపెనీ కంటైనర్లు, కోల్, బ్రేక్ బల్క్, ఇతర బల్క్ కార్గో సహా లిక్విడ్ కార్గో వ్యహారాలను చూస్తుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మల్టీ కార్గో ఫెసిలిటీతో 54 మిలియన్ల మెట్రిక్ టన్నులు (MMT) కార్గో కార్యకలాపాలను నిర్వహించింది.
ఆర్థిక సంవత్సరం FY19లో రూ.2,394 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. KPCL కొనుగోలు విలువ సుమారు రూ.13వేల 500 కోట్లుగా ఉంది. అంతర్గత క్రమ వృద్ధి, ప్రస్తుత నగదు నిల్వ ద్వారా కొనుగోలుపై నిధులను సమకూర్చనున్నట్టు తెలిపింది. రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి ఉన్న ఈ కొనుగోలు 120 రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ అభివృద్ధి వ్యూహానికి అనుగుణంగా ఈ పెట్టుబడి ఉందని అదానీ పోర్ట్స్ తెలిపింది. ఈ సముపార్జన 2025 నాటికి 400 MMT వైపు APSEZ పురోగతిని వేగవంతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. KPCLలో కార్గో వాల్యూమ్‌ను 7 సంవత్సరాలలో 100 MMTకి పెంచాలని APSEZ లక్ష్యంగా పెట్టుకుందని, దాని పరిశ్రమ మెరుగైన ఫలితాలతో 4 సంవత్సరాలలో EBIDTA రెట్టింపు చేస్తుందని అదానీ తెలిపారు.
గత వారమే స్నోమాన్ లాజిస్టిక్స్‌లో 40.25 శాతం వాటాను రూ.296 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ లోకి ప్రవేశించింది. ఈ ప్రకటనకు ముందు, అదానీ పోర్ట్స్ షేర్లు BSEలో శుక్రవారం (జనవరి 3, 2020) ట్రేడ్ 0.20 శాతం తగ్గి రూ .382.70 వద్ద ముగిసింది.