AliExpress: డోర్‌మ్యాట్లపై జగన్నాథుడి చిత్రాలతో అమ్మకాలు.. మండిపడుతున్న భక్తులు 

#RespectJagannath, #BoycottAliExpress లాంటి హ్యాష్‌ట్యాగ్లు భారత్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

AliExpress: డోర్‌మ్యాట్లపై జగన్నాథుడి చిత్రాలతో అమ్మకాలు.. మండిపడుతున్న భక్తులు 

Updated On : July 30, 2025 / 3:10 PM IST

ఒడిశాలోని పూరి జగన్నాథుడిని భక్తులు ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అటువంటి జగన్నాథుడి చిత్రంతో చైనా‌కు చెందిన గ్లోబల్ ఈ కామర్స్ వెబ్‌సైట్ అలీఎక్స్‌ప్రెస్‌లో డోర్‌మ్యాట్‌ను విక్రయిస్తున్నారు. దీంతో ఆ కంపెనీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

జగన్నాథుని ముఖ చిత్రంతో ముద్రించిన ఫ్లోర్ మ్యాట్‌ను కాళ్లు తుడిచేందుకు ఉపయోగించే ఉత్పత్తిగా తయారుచేయడంతో ఆ భగవానుడి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆ ఫ్లోర్‌ మ్యాట్‌ను తొక్కుతూ, కాళ్లు తుడుచుకుంటున్న ఫొటోను కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు.

శ్రీ జగన్నాథ టెంపుల్ మేనేజ్‌మెంట్ కమిటీకి చెందిన మాజీ సభ్యుడు మాధవ్ పూజాపాండా ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వాహకులు వెంటనే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. చైనా ప్రభుత్వంతో చర్చించి ఇటువంటి ఉత్పత్తులను నిలిపివేయాలని సూచించారు.

ఇటీవలి సంవత్సరాలలో జగన్నాథ సంప్రదాయానికి సంబంధించిన చిత్రాలు, పదాలకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కల్పించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్కులు త్వరగా అమలయ్యేలా చేస్తే ఇటువంటి చర్యలను అడ్డుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

అలీఎక్స్‌ప్రెస్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌సైట్‌ నుంచి ఇటువంటి డోర్‌మ్యాట్లను తొలగించాలని, వాటిని అమ్ముతున్నవారు, వెబ్‌సైట్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. #RespectJagannath, #BoycottAliExpress లాంటి హ్యాష్‌ట్యాగ్లు భారత్‌లో ట్రెండ్ అవుతున్నాయి.