Baal Aadhaar Card : ‘బాల్ ఆధార్’ కార్డు ఏంటి? 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎలా పొందాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఫుల్ ప్రాసెస్ ఇదిగో..!
Baal Aadhaar Card : బాల్ ఆధార్ కార్డ్ 5 ఏళ్ల లోపు పిల్లలకు అందించే ప్రత్యేక గుర్తింపు కార్డు. బయోమెట్రిక్స్ ఉండవు. పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.

Baal Aadhaar Card
Baal Aadhaar Card : మీ పిల్లలకు బాల్ ఆధార్ తీసుకున్నారా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. 5ఏళ్ల వయస్సు కన్నా తక్కువ ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ తీసుకోవచ్చు. వాస్తవానికి బాల్ ఆధార్ (Baal Aadhaar Card) నెంబర్ ఒకసారి మాత్రమే ఇస్తారు. కానీ, అందులో బయోమెట్రిక్స్ ఉండవు. కేవలం ఫొటో, ఇతర వివరాలు మాత్రమే ఉంటాయి.
ప్రత్యేకించి పిల్లల స్కూల్ అడ్మిషన్, ఆరోగ్య సేవలు, పెట్టుబడి సంబంధిత పథకాలకు ఆధార్ కార్డ్ అవసరం. బాల్ ఆధార్ కార్డ్ 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. పిల్లల తల్లి లేదా తండ్రి ఆధార్‌తో లింక్ అయిన 12 అంకెల ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. బాల్ ఆధార్ కార్డు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
బాల్ ఆధార్ అంటే ఏంటి? :
బాల్ ఆధార్ కార్డ్ అనేది 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జారీ చేసే ఆధార్ కార్డు. ఈ వయస్సు పిల్లల బయోమెట్రిక్ సమాచారం (ఫింగర్ ఫ్రింట్, కంటి ఐరీస్ స్కాన్) తీసుకోరు. ఎందుకంటే ఆ వయస్సులో ఈ బయోమెట్రిక్ డేటా పూర్తి స్థాయిలో ఉండదు. పిల్లల ఫొటో, పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల సమాచారం మాత్రమే కార్డులో రిజిస్టర్ చేస్తారు. బాల్ ఆధార్ నెంబర్ ఒకటి మాత్రమే ఉంది. అది ఎప్పటికీ మారదు.
బాల్ ఆధార్ ఎక్కడ పొందవచ్చు? :
మీరు ఏదైనా అధీకృత ఆధార్ ఎన్‌రోల్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా బాల్ ఆధార్ పొందవచ్చు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జనన సమయంలో ఆధార్ రిజిస్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఏ డాక్యుమెంట్లు అవసరం? :
బాల్ ఆధార్ పొందడానికి కొన్ని ప్రత్యేక డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
హాస్పిటల్ జారీ చేసిన లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన పిల్లల జనన ధృవీకరణ పత్రం (డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్)
తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు.
ఆధార్‌తో లింక్, అప్‌డేట్ కోసం తల్లి లేదా తండ్రి మొబైల్ నంబర్.
దరఖాస్తు (Baal Aadhaar Card) ప్రక్రియ ఏంటి? :
- మీ పిల్లాడు, డాక్యుమెంట్లతో సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లండి.
- రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో పిల్లల వివరాలను నింపండి.
- అన్ని డాక్యుమెంట్లకు ఫొటోకాపీలను జత చేసి ఇవ్వండి.
- అక్కడే మీ పిల్లల లైవ్ ఫొటో క్యాప్చర్ చేసి తీసుకుంటారు.
- ఆ తర్వాత, రిజిస్టర్ సంఖ్యతో స్లిప్ ఇస్తారు.
- మీరు ఆన్‌లైన్‌లో ఈ ఆధార్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
బాల్ ఆధార్ ఎన్ని రోజుల్లో వస్తుంది? :
రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత, 60 రోజుల నుంచి 90 రోజుల్లోపు బాల్ ఆధార్ కార్డు మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు పోస్ట్ ద్వారా వస్తుంది. ఆధార్ నంబర్ సమాచారం మీ మొబైల్ నంబర్‌కు కూడా వస్తుంది. లేదంటే.. UIDAI వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బాల్ ఆధార్ రుసుము ఎంత? :
బాల్ ఆధార్ 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పూర్తిగా ఉచితం. ఏదైనా రిజిస్ట్రేషన్ లేదా ప్రక్రియకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. బాలుడు లేదా బాలికకు 5 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు వారి ఫింగర్ ఫ్రింట్స్, కంటి ఐరీస్ అప్‌డేట్ చేసేందుకు బయోమెట్రిక్ కోసం మళ్ళీ ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అప్‌డేట్ కూడా పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.