ఎయిర్ టెల్ కు భారీ షాక్..బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే భారీ నష్టాలు, ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ఎయిర్‌టెల్ ను ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో వాణిజ్యమంత్రిత్వశాఖ కింద ఉండే డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT)బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (EPCG) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది.
ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్‌టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను “తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్” లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణగా 2018 ఏప్రిల్ నుండి ఇంపోర్ట్(దిగుమతి) లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్‌టెల్ తెలిపింది. కంపెనీ గతంలో ఉన్న అన్ని లైసెన్సుల రద్దు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుందని,అధికారుల ఆమోదం కోసం వేచి ఉందని ఎయిర్ టెల్ వర్గాలు తెలపాయి.
ఎగుమతి ప్రమోషన్ స్కీమ్ అయిన ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఇపిసిజి) కింద… ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే స్కీమ్ ప్రకారం… దిగుమతి చేసుకున్న మూలధన వస్తువులపై ఆదా అయిన సుంకానికి ఆరు రెట్లు సమానమైన EPCG ఎగుమతి బాధ్యతను నెరవేర్చాలి. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.