Gold: బంగారం కొంటున్నారా? తక్కువ ధరకు ఎక్కడ కొనుక్కోవచ్చు? భారత్‌తో పోల్చితే..
సుంకం చెల్లించి తీసుకురావడానికి గరిష్ఠంగా కిలో వరకు అనుమతి ఉంది.

Gold
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చిత వల్ల పెట్టుబడిదారులు బంగారంపై అధికంగా పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు పెరిగాయి. అంతేగాక భారత్‌లో ఈక్విటీ మార్కెట్‌లో జరిగిన కొన్ని మార్పుల వల్ల బంగారం సురక్షితమైన పెట్టుబడి మార్గంగా పరిగణిస్తున్నారు.
దీనివల్ల బంగారం డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. గోల్డ్ టాక్స్, దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడం వల్ల కొన్ని దేశాలు తక్కువ ధరకే బంగారాన్ని అమ్ముతున్నాయి. ఆ దేశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
24 క్యారెట్ల బంగారం.. 99.9% స్వచ్ఛమైన బంగారం. ఇందులో ఇతర లోహాలు కలవవు. అలాగే, మృదువుగా ఉండి సహజమైన బంగారు రంగును కలిగి ఉంటుంది. పెట్టుబడిదారులు 24 క్యారెట్ల బంగారు నాణేలు, కడ్డీలు వంటి లోహాలపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి లోహాలు ఉండడం వల్ల 91.67% స్వచ్ఛమైన బంగారంగా పిలువబడుతుంది. ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉండడమే కాకుండా కొంచెం తక్కువ బంగారు రంగులో ఉంటుంది.
బంగారం చౌకగా లభించే టాప్-9 దేశాలు: (ప్రతి 10 గ్రాములకు):
- బహ్రెయిన్: 10 గ్రాములకు 359 BHD, లేదా రూ. 83,085.5
- కువైట్: 10 గ్రాములకు కువాటి దినార్ 291.1, లేదా రూ. 82,421.48
- మలేషియా: 4,230 RM, లేదా రూ. 83,516
- ఒమన్: OMR 369, లేదా రూ. 83,296
- ఖతార్: గ్రాముకు QAR 352, లేదా రూ. 87,770
- సౌదీ అరేబియా: 3,590 సౌదీ రియాల్, లేదా రూ. 83,485.22
- సింగపూర్: SGD 1,331, లేదా రూ. 87,231.17
- దుబాయ్: AED 3,507.4, లేదా రూ. 83,292.65
- అమెరికా: $950, లేదా రూ. 82,858.35
ఇండియాలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,820 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాలయిన ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 80,500కు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 87,820 వద్ద ట్రేడవుతోంది. అలాగే భారత రాజధాని ఢిల్లీలో ధరలు వరుసగా రూ. 80,650, రూ. 87,970 వద్ద ఉన్నాయి.
భారతలో బంగారం దిగుమతిపై సుంకం ఎలా ఉందంటే?
బంగారం కడ్డీలు, నాణేలు అలాగే ఆభరణాలు సహా అన్ని రకాల బంగారం దిగుమతులపై సుంకం ప్రస్తుతం 6 శాతంగా ఉంది. దీనిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌లో 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
మీరు దుబాయ్ నుంచి భారత్‌కు బంగారాన్ని తీసుకువచ్చినప్పుడు, మీరు దుబాయ్‌లో కొనుగోలు చేసిన ధర ఆధారంగా కాకుండా, ప్రభుత్వం నోటిఫై చేసిన టారిఫ్ లేదా బేస్ రేటు ఆధారంగా కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం పురుషులు 20 గ్రాముల వరకు, మహిళలు 40 గ్రాముల వరకు ఆభరణాల రూపంలో తీసుకురావచ్చు.
ఈ పరిమితిని మించితే లేదా ఆభరణాలు కాకుండా ఇతర రూపాల్లో బంగారాన్ని తీసుకువస్తే, కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. సుంకం చెల్లించి తీసుకురావడానికి గరిష్ఠంగా కిలో వరకు అనుమతి ఉంది.