మాల్స్, సూపర్ మార్కెట్లు వద్దు కిరాణ షాపులే ముద్దు.. కరోనా, లాక్ డౌన్ తెచ్చిన మార్పు

కరోనా, లాక్ డౌన్ దెబ్బకి జీవితాలు మారిపోయాయి. ప్రజల లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. జీవన విధానం, తిండి,

  • Published By: naveen ,Published On : June 1, 2020 / 12:53 PM IST
మాల్స్, సూపర్ మార్కెట్లు వద్దు కిరాణ షాపులే ముద్దు.. కరోనా, లాక్ డౌన్ తెచ్చిన మార్పు

Updated On : June 1, 2020 / 12:53 PM IST

కరోనా, లాక్ డౌన్ దెబ్బకి జీవితాలు మారిపోయాయి. ప్రజల లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. జీవన విధానం, తిండి,

కరోనా, లాక్ డౌన్ దెబ్బకి జీవితాలు మారిపోయాయి. ప్రజల లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. జీవన విధానం, తిండి, ప్రయాణం, ఖర్చుల విషయాల్లో చాలా మార్పు వచ్చింది. లైఫ్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టు తయారైంది. గతంలో షికార్లు, ట్రిప్పులు, టూర్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. అంతేకాదు హోటల్స్, రెసారెంట్లకు వెళ్లి తినడం కూడా మానేశారు. ఇప్పుడు సరుకుల కొనుగోళ్ల విషయంలోనూ పెను మార్పే వచ్చింది. గతంలో సూపర్ మాల్స్, సూపర్ మార్కెట్ల వెంట పడిన జనం ఇప్పుడు రూటు మార్చారు. మాల్స్, సూపర్ మార్కెట్లు వద్దు ఇంటి పక్కన ఉండే కిరాణ షాపులు ముద్దు అంటున్నారు.

నూటికి 72 మంది కిరాణా దుకాణాల్లోనే కొనుగోళ్లు:
అవసరమైన వినియోగ వస్తువులు, నిత్యావసరాల కోసం మాల్స్‌కు బదులు, స్థానిక కిరాణ దుకాణాలే మేలంటున్నారు. గత ఆరు వారాల నుంచి వినియోగదారుల వైఖరిలో ఈ మార్పు కనిపిస్తోంది. నూటికి 72 మంది స్థానిక వస్తువుల కోసం ఇంటికి దగ్గరలో ఉండే కిరాణా దుకాణాలే మేలని తేల్చారు. మారిన ఆర్థిక పరిస్థితులతో గతంలో మాదిరి ఎడాపెడా ఏది పడితే అది కొనేందుకూ వినియోగదారులు ఇష్టపడడం లేదు. డెలాయిట్‌ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది ఆహార వస్తువుల మీద, 52 శాతం మంది ఇతర నిత్యావసరాల మీద ఆసక్తి చూపారు. మరోవైపు కరోనా దెబ్బతో ఓలా, ఉబర్‌ వంటి రైడ్‌ హేలింగ్‌ సర్వీసులకూ గిరాకీ తగ్గనుంది. 

స్థానిక కిరాణ షాపులే మేలు:
గతంలో ఫ్యామిలీ అంతా కలిసి మాల్‌కు వెళ్లడం.. ఏసీ సూపర్‌ మార్కెట్లో అవసరం ఉన్నవీ, లేనివీ కొనుగోలు చేయడం.. అక్కడే హోటల్‌లో భోంచేసి ఇంటికి రావడం.. ఇదీ కొవిడ్‌-19కు ముందు పట్టణాలు, నగరాల్లో సరకుల కొనుగోలు తీరు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో ఇదంతా మారిపోయింది. అధిక శాతం మంది వినియోగదార్లు దూర ప్రాంతాలకు వెళ్లి సరకులు కొనుగోలు చేయడం కంటే ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణాలవైపే మొగ్గు చూపుతున్నారు.

కిరాణ షాపుల పట్ల పెరిగిన నమ్మకం:
‘డెలాయిట్‌ గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ ది కన్జూమర్‌ ట్రాకర్‌’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఇ-మెయిల్‌ ద్వారా అడిగిన ప్రశ్నలకు 18 ఏళ్లు నిండిన సుమారు 1,000 మంది స్పందించారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌ వంటి 13 దేశాల్లో ఇలాంటి సర్వేనే డెలాయిట్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ 19 నుంచి మే 16 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌ నుంచి వచ్చిన స్పందనలు ఇలా ఉన్నాయి.

* చాలామంది వినియోగదార్లు ఇళ్లలో సరకులు నిల్వ ఉంచుకోడానికి ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉండే కిరాణా దుకాణాల నుంచి అప్పటికప్పుడు తెచ్చుకొనేందుకే మొగ్గుచూపుతున్నారు.
* గత 6 వారాల్లో వ్యయ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని 55 శాతం మంది వినియోగదార్లు వెల్లడించారు. కిరాణా వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నామన్నారు. రోజు వారీ ఇంటి సామాన్లపై ఖర్చు చేస్తామని 52 శాతం మంది తెలిపారు.
* లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా దుకాణాలే సరకులు అందించాయి. మనకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటున్నందున, అక్కడే కొంటామని 72 శాతం మంది వెల్లడించారు.
* సంక్షోభం సమయంలో బాగా స్పందించిన బ్రాండ్లను కొనుగోలు చేస్తామని 64 శాతం మంది తెలిపారు.

ప్రయాణాలకు దూరంగా ఉంటాం, సొంత వాహనం కొంటాం:
* ప్రయాణాల విషయానికి అధిక శాతం మంది ప్రజా రవాణాను పరిమితం చేసుకుంటామన్నారు. క్యాబ్‌లు, ఇతర అద్దె వాహనాల వినియోగానికి దూరంగా ఉండాలని, గుంపుగా కలిసి ప్రయాణం చేసేందుకు దూరంగా ఉంటామని 70 శాతం మంది తెలిపారు. 
* చింతలేని ప్రయాణం కోసం 79 శాతం మంది సొంతంగా వాహనం సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు.

సవాళ్ల సమయంలో వినియోగదార్ల ప్రవర్తన, కొనుగోలు సరళి ఎలా ఉంటుందనేది ఈ సర్వేతో తెలిసింది. నిర్ణయాలు తీసుకోవడంలో వారి ఆందోళనను ఇది ప్రతిబింబించింది. విక్రయాలు, మార్కెటింగ్‌ విషయంలో ఉత్పత్తి సంస్థలు కూడా కొత్త వ్యూహాలను రచించడానికి ఇది తోడ్పడుతుందని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌, కన్జూమర్‌ ఇండస్ట్రీ లీడర్‌ అనిల్‌ తెలిపారు. మొత్తంగా కరోనా, లాక్‌డౌన్‌ పీరియడ్‌లో కిరాణా దుకాణాల పట్ల వినియోగదారుల్లో నమ్మకం పెరిగినట్టు స్పష్టమైంది.