బాబోయ్.. గత ఐదేళ్లలో 24 క్యారట్ల తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందో తెలుసా? కారణం ఏమిటంటే..
కరోనా మహమ్మారిరాక ముందు బంగారం ధర, కరోనా మహమ్మారి వచ్చిన తరువాత బంగారం ధరలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కరోనాకు ముందు 2019లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold
Gold Rate : బంగారం అంటే మక్కువ చూపని మహిళలు ఉండరు. పెళ్లిళ్లు, పండుగలు.. ఇలా ఇండ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా మహిళలు ముందుగా బంగారం కొనుగోళ్లు జరుపుతుంటారు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు.. తమ హోదాను ఇతరులకు తెలియజేసేందుకు సైతం మహిళలు బంగారంను ధరిస్తుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలుసైతం పైసాపైసా కూడబెట్టుకొని బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం అందనంత ఎత్తులోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73వేలు దాటింది. రానున్న రోజుల్లో ఈ ధర రూ. 75వేలు.. మరో నాలుగైదు నెలల్లో రూ. 80వేలకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా విపత్తుకు ముందు వరకు 10 గ్రాములు బంగారం ధర రూ.40వేలు ఉంది.. మూడేళ్ల వ్యవధిలోనే రూ. 70వేలకు చేరిపోయింది. బంగారం ధర భారీగా పెరగడంతో 24, 22 క్యారట్ల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. 22 క్యారట్ల బంగారంతో కొత్త ఆకృతులతోకూడిన ఆభరణాలను వ్యాపారులు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం, ధర పెరగడంతో కొనుగోళ్లకు పసిడి ప్రియులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో 18, 16 క్యారెట్లతో అదునాతన డిజైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయినా, ఇంట్లో శుభకార్యాలు ఉండి.. తప్పనిసరి అయితేతప్ప బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, దీంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
కరోనా మహమ్మారిరాక ముందు బంగారం ధర, కరోనా మహమ్మారి వచ్చిన తరువాత బంగారం ధరలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కరోనాకు ముందు 2019లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 35,200 ఉంది. 2020 సంవత్సరంలో రూ.48,651 చేరింది. 2022 నుంచి బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. 2022లో 24 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర ఏకంగా 50వేల మార్క్ ను దాటేసి రూ. 52,670కి చేరింది. 2023లోనూ బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది.. ఆ ఏడాది చివరి నాటికి 10గ్రాముల బంగారం ధర రూ. 65,330కి చేరింది. 2024 సంవత్సరంలో బంగారం ధరలు తుగ్గుతాయని అందరూ భావించారు. అయితే, తొలి రెండు నెలలు కాస్త తగ్గిన గోల్డ్ ధర.. మార్చి, ఏప్రిల్ నెలలో భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 2024 మే నెలలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 73,150కు చేరింది. అంటే గడిచిన ఐదేళ్లలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 37,930 పెరిగింది.
బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా.. అతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించవచ్చునని అంచనాలు బలపడ్డాయి. దీంతో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు చైనా నుంచి డిమాండ్ పెరగడమూ బంగారం పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ట్రెడ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్లో, సెంటిమెంట్ ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం బంగారం రేట్లు మారుతుంటాయి. దీంతోపాటు రూపాయి మారకం విలువలో మార్పులు కూడా బంగారంపై ఇంఫాక్ట్ చూపుతాయి. రూపాయి బలపడితే బంగారం ధర దిగిరావడం… రూపాయి బలహీనపడితే బంగారం ధర పెరగడం జరగుతుంది. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులుకూడా గోల్డ్‌పై ప్రభావం చూపుతాయి.