Gold Rate: రాబోయే రోజుల్లో బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..? ఆశ్చర్యకర విషయాలు చెప్పిన నిపుణులు
కొద్దిరోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

Gold Rate: కొద్దిరోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో 10గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దిగువకు వచ్చింది. తాజాగా.. నమోదైన ధరల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.97వేలకు చేరింది.. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 89వేలకు పడిపోయింది. దీంతో బంగారం కొనుగోలు దారుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అయితే, రాబోయే రోజుల్లో ప్రస్తుతం మాదిరిగానే బంగారం ధర తగ్గుతుందా..? లేదంటే పెరుగుతుందా..? అనే అంశంపై నిపుణులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల మధ్య బంగారం ధర పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టైటాన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. అయితే, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కారణంగా సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారంపై పెట్టుబడులు తగ్గి.. గోల్డ్ రేటు కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది.
చైనా దేశం నుంచి భూమిలో అరుదుగా లభించే మూలకాల (ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, మరియు రక్షణ రంగాలలో ఉపయోగించే కీలకమైన పదార్థాలు) రవాణాను వేగవంతం చేయాలనేదానిపై గురువారం అమెరికా, చైనా దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పురోగతి కనిపించడంతో చైనా, అమెరికా మధ్య వాణిజ్య వార్ పూర్తిస్థాయిలో తొలగిపోవడానికి అనుకూలంగా మార్కెట్లు భావించాయి. దీంతో ప్రపంచ షేర్లు ర్యాలీ కొనసాగింది. మరోవైపు.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కూడా కలిసొచ్చింది.
చైనాతో అమెరికా సత్సంబంధాలు పెరుగుతుండటం, మధ్యప్రాచ్యంలో పరిణామాల కారణంగా అంతర్జాతీయ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం పెట్టుబడిదారులు లాభాలు పొందడం ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పించిందని ఆర్ జేఓ ప్యూచర్స్ సీనియర్ మార్కెట్ వ్యూహకర్త డేనియల్ పావిలోనిస్ తెలిపారు.
2025లో ఫెడరల్ రిజర్వ్ స్వల్పకాలిక రుణ వ్యయాలను 75 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే, భౌగోళిక రాజకీయాల కారణంగా బంగారంపై పెట్టుబడులు తగ్గుతున్నందున బంగారం ధరల తగ్గుదలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.