Gold Prices: స్థిరంగా బంగారం ధరలు.. మీరు ఇప్పుడు కొనాలా? వద్దా?

అందుకు సంబంధించిన డేటా కోసం పెట్టుబడిదారులు, వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

Gold Prices: స్థిరంగా బంగారం ధరలు.. మీరు ఇప్పుడు కొనాలా? వద్దా?

Gold

Updated On : March 10, 2025 / 7:13 PM IST

డాలర్‌ మారకం విలువ బలంగా ఉండడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలపై ద్రవ్యోల్బణం డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ వారం పెట్టుబడిదారులు, వ్యాపారాలు.. ద్రవ్యోల్బణం డేటా కోసం ఎదురు చూశారు.

ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడానికి కారణం అవుతుంది. దీంతో బంగారం రేటు తగ్గుతుంది. దీంతో అందుకు సంబంధించిన డేటా కోసం పెట్టుబడిదారులు, వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

ఇవాళ ఉదయం నాటికి స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2,913.09 డాలర్లుగా ఉంది. అదే విధంగా అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి, ఔన్సుకు 2,920.10 డాలర్లకు చేరాయి. ఇతర ప్రధాన కరెన్సీల ట్రెండ్‌తో పోలిస్తే యూఎస్ డాలర్ బలహీనంగా ఉండడం వల్ల డాలర్ ఇండెక్స్ గత వారం నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి మించి కొనసాగింది. దీంతో ఇతర కరెన్సీ ఉన్న దేశాల్లో బంగారం రేటు తగ్గి డిమాండ్ పెరిగింది.

డాలర్ విలువ పెరిగితే బంగారం ధరపై ప్రభావం పడుతుందని విశ్లేషకుడు పీటర్ ఫెర్టిగ్ తెలిపారు. బంగారం ధర $2,900 దిగువకు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇప్పుడు బంగారం మార్కెట్ ఫోకస్ అంతా వాణిజ్య ఉద్రిక్తతలపై కొనసాగుతోందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై విధించనున్న సుంకాలు త్వరలో అమల్లోకి రావొచ్చని అయన హెచ్చరించారు.

బంగారం ధర $2,900కి పైగా కొనసాగడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అస్థిరతను సూచిస్తున్నదని కైనెసిస్ మనీ మార్కెట్ విశ్లేషకుడు ఫ్రాంక్ వాట్సన్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు బుధవారం వెలువడనున్న అమెరికా వినియోగదారుల ధర సూచిక (CPI) డేటా, అలాగే గురువారం వెలువడనున్న ఉత్పత్తిదారుల ధర సూచిక (PPI) పై దృష్టి సారిస్తున్నారు.

ఫెడ్ 2024లో మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ఈ ఏడాది వాటిని స్థిరంగా ఉంచింది. మార్కెట్ అంచనాల ప్రకారం, జూన్‌లో మరొక తగ్గింపు జరిగే అవకాశముంది.

బంగారం ద్రవ్యోల్బణానికి అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితికి రక్షణగా ఉంటుంది. చైనా ఫిబ్రవరిలో వినియోగదారుల ధర సూచిక అంచనాలను అందుకోలేకపోయిందని, 13 నెలల్లోనే గరిష్ఠస్థాయికి పడిపోయిందని సమాచారం.

ఇతర లోహాల విషయానికి వస్తే.. స్పాట్ సిల్వర్ 0.2% పెరిగి ఔన్సుకు $32.59కి చేరగా, ప్లాటినం 1% పెరిగి $973కి చేరింది. పలాడియం 0.5% పెరిగి $952.68 వద్ద ఉంది.

బంగారం ధరలపై విశ్లేషకులు చెప్పిన అంచనాల ప్రకారం.. ప్రస్తుతం గోల్డ్ ధరలు స్థిరంగానే ఉన్నాయి కాబట్టి కొనవచ్చు. ఎందుకంటే ఇవి మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోవడం మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.