Gold prices: దేశమంతటా బంగారం ధరలు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది? ఈ రాష్ట్రంలో దీన్నే సాధించారు.. మీకేంటి లాభం?
ఈ విధానం అమలైతే వినియోగదారులకు సరైన ధరతో బంగారాన్ని అందించడంతో పాటు, ధరల్లో ఉండే తేడాలను తొలగించేందుకు తోడ్పడనుంది.

కేరళ వ్యాప్తంగా ఇకపై బంగారం ధరలు ఒకే విధంగా ఉండనున్నాయని భీమా గ్రూప్ ఛైర్మన్, ఆల్ కేరళ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి. గోవిందన్ తెలిపారు. ఇటీవల కేరళలోని రెండు వ్యాపార సంఘాలు విలీనమై కొత్తగా “కేరళ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్” ఏర్పడింది. అయితే, ఈ విలీనానికి వ్యతిరేకంగా ఓ వర్గం ఉంది. ఆ వర్గం మాత్రం ఇందులో చేరలేదు.
ప్రస్తుతం కేరళలో బంగారం వ్యాపార సంఘాల సభ్యత్వంపై ఆధారపడి మూడు రకాల ధరలు అమలులో ఉన్నాయని డాక్టర్ గోవిందన్ తెలిపారు. అయితే, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బంగారన్ని ఒకే ధరకు విక్రయించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విధానం వల్ల ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. 2022 నుంచి ఈ చర్చలు కొనసాగుతున్నప్పటికీ, తాజా ప్రకటన ద్వారా దీనిని తక్షణమే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో కేరళ బంగారం వినియోగంలో ముందుంది. సాధారణంగా, బ్యాంక్ రేట్ ఆధారంగా బంగారం ధర నిర్ణయించాలి. కానీ, మార్కెట్ పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంక్ రేట్ కన్నా ఎక్కువ ధరలకు బంగారం అమ్మకం జరుగుతోంది.
కేరళలోనూ ప్రతిరోజు ధరల్లో మార్పులు ఉండేవి. అయితే, బ్యాంక్ రేట్, జీఎస్టీ, ఇతర దిగుమతి పన్నులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉన్నందున, కేరళలో ఉన్న బంగారం వ్యాపారులు ఇప్పుడు ఒకే ధరను నిర్ణయించనున్నారు.
ఒక దేశం – ఒక ధర కోసం డిమాండ్
భారత్ వ్యాప్తంగా బంగారం విక్రయంలో మరింత పారదర్శకత తీసుకురావడానికి “ఒక దేశం – ఒక ధర” (ONOR) విధానాన్ని అమలు చేయాలని పరిశ్రమ నాయకులు కృషి చేస్తున్నారు. వివిధ వర్గాలతో చర్చలు కొనసాగుతున్నాయి.
త్వరలో దీనిపై అవగాహన కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రవాణా ఖర్చులు, డిమాండ్, సరఫరా తేడాల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. అయితే, ఒకే ధరల విధానం అమలైతే వినియోగదారులకు సరైన ధరతో బంగారాన్ని అందించడంతో పాటు, ధరల్లో ఉండే తేడాలను తొలగించేందుకు తోడ్పడనుంది.