అప్పటితో పోల్చుకుంటే: రూ.2వేలు తగ్గిన బంగారం ధర

అప్పటితో పోల్చుకుంటే: రూ.2వేలు తగ్గిన బంగారం ధర

Updated On : November 19, 2019 / 1:01 PM IST

బంగారం క్రమంగా తగ్గుతూ ఉండటం అంతర్జాతీయ మార్కెట్‌ను నిరాశపరుస్తున్నా సగటు వినియోగదారుడికి శుభవార్తే. సెప్టెంబరు నెలలో రూ.40వేలకు చేరిన 10గ్రాముల బంగారం ధర నవంబరు 15 శుక్రవారం నాటికి రూ.37,971 స్థాయికి క్షీణించింది. ఈ 3 నెలల్లో బంగారం ధర ఏకంగా రూ.2వేలు పడిపోయింది. బంగారంతో పాటు వెండి ధర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వెండి కేజీకి రూ.44వేల 385 స్థాయికి తగ్గిపోయింది. సెప్టెంబర్ ఆరంభంలో రూ.50 వేల పైకి చేరిన బంగారం ధర ప్రస్తుతం భారీగా తగ్గిపోయింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. 

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చేట్లుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు చేస్తున్న ర్యాలీలు బంగారం డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి. 
 
ఇప్పటి దాకా మూడు సార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన అమెరికా ఫెడరల్ రిజర్వు ఇకపై రేట్ల కోత ఉండదని సంకేతాలిచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపడం తగ్గించేశారు. దిగుమతి సుంకాల పెంపు, రూపాయి బలహీనత వంటి అంశాల కారణంగా బంగారం ధర బాగా పెరిగింది. బంగారం కొనాలనకునేవారు ఆసక్తి కనబరచకపోవడంతో పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడి ధరలో మార్పు కనిపిస్తోంది.