రద్దీని బట్టి చార్జీల మోత.. ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ జారీ.. ఇక చార్జీలు ఇలా..

ఈ మార్పులు ఏమిటి?  

రద్దీని బట్టి చార్జీల మోత.. ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ జారీ.. ఇక చార్జీలు ఇలా..

Updated On : July 2, 2025 / 1:59 PM IST

మీరు రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికో, అర్జెంట్ పని మీద బయటకు వెళ్లడానికో ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido) వంటి యాప్‌లను వాడుతున్నారా? కేంద్ర రవాణా శాఖ ఈ సర్వీసుల విషయంలో కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త రూల్స్ మీ ప్రయాణ ఖర్చులపై, డ్రైవర్ల భద్రతపై, మొత్తం రైడ్ ఎక్స్‌పీరియన్స్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

ఈ మార్పులు ఏమిటి?  

పీక్ అవర్స్‌లో ధరల మోత  

ఇది ప్రయాణికులకు కొంచెం చేదువార్తే. గతంలో పీక్ అవర్స్‌లో (ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో) సాధారణ చార్జీపై గరిష్ఠంగా 1.5 రెట్లు (50% ఎక్కువ) మాత్రమే వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 2 రెట్లకు (100% ఎక్కువ) పెంచారు. అంటే, బేస్ ఫేర్ రూ.100 అయితే, పీక్ అవర్స్‌లో రూ.200 వరకు వసూలు చేయవచ్చు.

రద్దీ లేని సమయాల్లో మాత్రం, బేస్ ఫేర్‌ కన్నా 50% తక్కువకు కూడా రైడ్ లభించే అవకాశం ఉంది. రద్దీ సమయాల్లో ఎక్కువ మంది డ్రైవర్లు అందుబాటులోకి వచ్చేలా ప్రోత్సహించడం, తద్వారా వెయిటింగ్ టైమ్ తగ్గించడమే ఈ కొత్త గైడ్‌లైన్స్‌ ఉద్దేశం.

ఇష్టమొచ్చినట్టు రైడ్ క్యాన్సిల్ చేశారో…
ఇకపై అనవసరంగా రైడ్ క్యాన్సిల్ చేయడం కుదరదు. ఈ రూల్ ప్రయాణికులకు, డ్రైవర్లకు ఇద్దరికీ వర్తిస్తుంది. డ్రైవర్ రైడ్‌ను యాక్సెప్ట్ చేశాక, సరైన కారణం లేకుండా క్యాన్సిల్ చేస్తే, మొత్తం చార్జీలో 10% జరిమానా (గరిష్ఠంగా రూ.100) చెల్లించాలి. ప్రయాణికులు క్యాన్సిల్ చేసినా అదే రూల్ వర్తిస్తుంది. డ్రైవర్ వచ్చాక మీరు క్యాన్సిల్ చేస్తే, ఫైన్ తప్పదు. అనవసరమైన క్యాన్సిలేషన్లను తగ్గించి, సమయాన్ని వృథా కాకుండా చూడడమే దీని ఉద్దేశం.

ఆరోగ్య బీమా
ఇది డ్రైవర్లకు అతిపెద్ద శుభవార్త. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తెచ్చింది. ప్రతి డ్రైవర్‌కు కంపెనీ తప్పనిసరిగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా చేయించాలి. అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రతి సంవత్సరం డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇవ్వాలి.

కస్టమర్ల నుంచి తక్కువ రేటింగ్ పొందుతున్న డ్రైవర్లకు (బాటమ్ 5%) ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి ప్రవర్తనను మెరుగుపరచాలి. శిక్షణకు హాజరుకాకపోతే, వారిని ప్లాట్‌ఫామ్ నుంచి తాత్కాలికంగా తొలగించవచ్చు. డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం, ప్రయాణికులకు సురక్షితమైన, మెరుగైన సేవలు అందేలా చూడటమే దీని ఉద్దేశం.

ఇకపై ప్రతి వాహనానికి ట్రాకింగ్ 
ప్రయాణికుల భద్రతను మరింత పెంచేందుకు, ప్రతి క్యాబ్ లేదా బైక్‌లో VLTD (Vehicle Location, Tracking Device) తప్పనిసరిగా ఉండాలి. ఈ డేటాను కంపెనీతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో కూడా పంచుకోవాలి. దీనివల్ల వాహనం ఎక్కడుందో ఎప్పుడైనా ట్రేస్ చేయవచ్చు.

పీక్ అవర్స్‌లో ధరలు పెరగడం కొంత భారమైనప్పటికీ, డ్రైవర్లకు భద్రత, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా చూడటం మంచి పరిణామం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేస్తాయో వేచి చూడాలి.