8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.. ఎవరి జీతాలు ఎంత పెరుగుతాయంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 మిలియన్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 6.9 మిలియన్లకుపైగా పెన్షనర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి.
8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అతి భారీ గుడ్ న్యూస్.. త్వరలో జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (అక్టోబర్ 28)న కేంద్ర మంత్రివర్గం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 5 మిలియన్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 6.9 మిలియన్లకు పైగా పెన్షనర్లకు భారీ ప్రయోజనాన్ని అందిస్తుంది.
8వ వేతన సంఘం ఏర్పడిన 18 నెలల్లోపు సిఫార్సులను (8th Pay Commission) సమర్పిస్తుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అశ్విని వైష్ణవ్ వివరించారు. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఉద్యోగుల వైపు నుంచి సంప్రదింపుల తర్వాత నిబంధనలను ఖరారు చేసినట్లు వైష్ణవ్ చెప్పారు.
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కమిషన్ ఏర్పాటు :
8వ వేతన సంఘం ఏర్పాటుపై రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, రాష్ట్రాలు వంటి కీలక భాగస్వాముల నుంచి సూచనలు కోరినట్లు కేంద్ర ప్రభుత్వం జూలైలో పార్లమెంటుకు తెలిపింది. వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది.
7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పడింది. దీనికి సంబంధించి సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమలు అవుతాయి. 8వ వేతన సంఘం చైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ఐఐఎం బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ పులక్ ఘోష్, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సభ్యులుగా నియమితులయ్యారు.
జీతం ఎంత పెరుగుతుంది? :
8వ వేతన సంఘం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయనే దానిపై అధికారిక సమాచారం లేనప్పటికీ, జీతాలు భారీగా పెరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు.. లోయర్ డివిజన్ క్లర్కులకు రూ. 1,900 గ్రేడ్ పే ఉంటుంది. 7వ వేతన సంఘం ప్రకారం ప్రాథమిక వేతనం రూ.18వేలుగా ఉంటుంది.
HRA, DA, ట్రావెల్ అలవెన్స్ (TA) కలిపితే దాదాపు రూ. 37,120 నుంచి రూ.39,370 వరకు చేరవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస ప్రాథమిక జీతం ఆధారంగా వేతన సంఘం సిఫార్సులను చేస్తుంది. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు ఉండేది. 8వ వేతన సంఘంలో 3 రెట్లు నుంచి 3.42 రెట్లు ఉంటుందని అంచనా. 3 రెట్లు కూడా ప్రాతిపదికగా ఉంటే లోయర్ డివిజన్ క్లర్క్ వేతనం రూ. 59,700కు పెరుగుతుంది.
