బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్లాన్

ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం టెండర్లను హెచ్‌ఎండీఏ ఆహ్వానించింది.

బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్లాన్

hmda invite tender to develop budvel mokila layout

Budvel Mokila Layout : భూముల వేలంతో ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది హెచ్‌ఎండీఏ. ఉప్పల్ భగాయత్ లేఅవుట్, కోకాపేట్ నియోపోలీస్, బుద్వేల్, మోకిలా.. ఇలా వరుసగా లేఅవుట్లలో భూములను వేలం వేసింది. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌లో మొదటి వేలంలో 8 ప్లాట్లలోని 49.92 ఎకరాల విక్రయంతో 2వేల కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది హెచ్ఎండీఏ. రెండో వేలంలో 45.33 ఎకరాలతో కలిసి మొత్తం 3వేల 319 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇక్కడ ఒక ఎకరం ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా పలికింది.

ఇక మోకిలా లేఅవుట్‌లో 350 ప్లాట్లు వేలం వేయగా 700 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. గజం ధర అత్యధికంగా ఒక లక్షా 5 వేల రూపాయలు పలికింది. బుద్వేల్‌లోని ప్రభుత్వ భూములకు కూడా మంచి ధర దక్కింది. దాదాపు 100 ఎకరాలకు హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరా 41 కోట్ల 25 లక్షల రూపాయల ధర పలికింది. మొత్తం మీద చూస్తే బుద్వేల్‌లో 3 వేల 626 కోట్ల ఆదాయం హెచ్‌ఎండీఏకు దక్కింది. ఇలా మంచి ఆదాయం వచ్చిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది హెచ్ఎండీఏ. ముందుగా బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం టెండర్లను హెచ్‌ఎండీఏ ఆహ్వానించింది.

ఈ లేఅవుట్లలో విశాలమైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, అన్ని రకాల కేబుల్స్ కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. భారీ ప్లాట్లలో హైరైజ్ అపార్టుమెంట్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉండటంతో పాటు మల్టీపర్పస్ కోసం ఎక్కువగా నిర్మాణాలు జరిగే అవకాశముంది. బుద్వేల్‌, మోకిలా లేఅవుట్లలో 400 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికారులు అంచనాలు రూపొందించారు. దీనికి అనుగుణంగా అధికారులు టెండర్లు కూడా పిలిచారు. టెండర్ల గడువు ఈనెల 29తో ముగియనుంది. మార్చిలో ఈ లేఅవుట్లలో డెవలప్‌మెంట్‌ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. మౌలిక సదుపాయాల విషయంల ఎలాంటి రాజీ పడకుండా డెవలప్‌ చేయాలని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

Also Read: ఓఆర్‌ఆర్‌ సమీపంలో 25 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ సిటీ.. రియాల్టీ ప్రాజెక్టులకు భారీ డిమాండ్

కోకాపేట్‌లోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ వేలంలో ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలికిందంటే.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా ఓ కారణమని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌ సిటీ బ్రాండ్‌కు తగ్గట్లుగా లేఅవుట్లలో మౌలిక సదపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు.