Credit Card Bill : మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. బ్యాంకులు ఇలా ముక్కు పిండి వసూలు చేస్తాయి తెలుసా? ఫుల్ డిటెయిల్స్..!
Credit Card Bill : క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు డబ్బును వసూలు కోసం అనేక చర్యలు తీసుకుంటాయి. క్రెడిట్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలివే..
Credit Card Bill (Image Credit To Original Source)
- మీ నెలవారీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం లేదా?
- క్రెడిట్ బిల్లు కట్టకుండా ఎగ్గొడితే బ్యాంకులు ఏం చేస్తాయి?
- రిమైండర్లు, రికవరీ ఏజెంట్లతో అడిగిస్తాయి.. ఆ తర్వాతే చర్యలు
- క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే భారీగా వడ్డీ రేట్లు వసూలు
Credit Card Bill : ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక ఖర్చు కోసం క్రెడిట్ కార్డు గీకేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి అత్యవసర ఖర్చుల వరకు ప్రతిదానికీ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తారు. అయితే, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు మాత్రం ఊరుకుంటాయా? ముక్కు పిండి మరి వసూలు చేస్తాయి. తమ డబ్బును తిరిగి పొందడానికి కఠినమైన చర్యలు తీసుకుంటాయి.
మీకు క్రెడిట్ కార్డు ఉందా? మీ క్రెడిట్ కార్డు బిల్లు సరిగా చెల్లిస్తున్నారా? క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఏమౌతుంది? బ్యాంకులు ఇలాంటి మొండి బకాయిలను ఎలా వసూలు చేస్తాయి? బిల్లు ఎగ్గొట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కాల్స్, మెసేజ్, ఇమెయిల్స్ ద్వారా రిమైండర్లు :
మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే.. బ్యాంక్ మొదట మీకు కాల్స్, టెక్స్ట్‌లు, ఇమెయిల్‌ల ద్వారా రిమైండర్‌లను పంపుతుంది. బకాయి మొత్తాన్ని త్వరగా చెల్లించమని రిక్వెస్ట్ చేస్తుంది.
ఆలస్య రుసుములు, భారీ వడ్డీలు :
బ్యాంకులు రిమైండర్‌లు ఇచ్చినప్పటికీ మీ క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించకపోతే.. బ్యాంక్ బిల్లుకు వివిధ ఛార్జీలను విధిస్తుంది. అందులో ఆలస్య చెల్లింపు ఛార్జీలు, వడ్డీ కూడా ఉంటాయి. తద్వారా మీ క్రెడిట్ బిల్లు మరింత పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. రోజువారీగా వసూలు అవుతాయి. దాంతో మీ చిన్న క్రెడిట్ బిల్లు కూడా భారీగా పెరిగిపోతుంది.

Credit Card Bill (Image Credit To Original Source)
క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది :
మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడంలో విఫలమైతే.. మీ బ్యాంక్ మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేస్తుంది. తద్వారా మీరు కొత్త లావాదేవీలు చేయలేరు. చాలా సందర్భాల్లో బ్యాంక్ మీ క్రెడిట్ లిమిట్ కూడా తగ్గించవచ్చు. అయితే, వివిధ బ్యాంకులు వేర్వేరు రూల్స్ అమలు చేస్తాయి.
రికవరీ ఏజెంట్‌ను సంప్రదించడం :
మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసిన తర్వాత కూడా మీ బిల్లు చెల్లించకపోతే.. బ్యాంక్ ఆ విషయాన్ని తమ రికవరీ టీమ్ లేదా థర్డ్ పార్టీ ఏజెంట్‌కు సూచిస్తుంది. ఈ ఏజెంట్లు మీకు కాల్ చేయవచ్చు లేదా పేమెంట్ కోసం మీ ఇంటికి రావచ్చు. అయితే, రికవరీ ఏజెంట్లు సూచించిన రూల్స్, గడువులకు కట్టుబడి ఉండాలి.
చట్టపరంగా చర్యలు :
రికవరీ ఏజెంట్ తర్వాత కూడా బ్యాంకుకు డబ్బును తిరిగి రాకుంటే అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం బ్యాంకు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. లీగల్ నోటీసు, కోర్టు కేసు లేదా పరిష్కారం అడగవచ్చు. తద్వారా మోసం, ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకుని డబ్బులు తిరిగి రాబట్టుకుంటాయి.
