Hyderabad: రియాల్టీ రంగంలో దూసుకుపోతోన్న హైదరాబాద్‌.. అనరాక్‌ లేటెస్ట్ రిపోర్ట్‌

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడు నగరాల్లో గృహాల సగటు ధరలు ఏటా 11 శాతం పెరిగాయి.

Hyderabad: రియాల్టీ రంగంలో దూసుకుపోతోన్న హైదరాబాద్‌.. అనరాక్‌ లేటెస్ట్ రిపోర్ట్‌

Hyderabad sees 18 percent spike in property sales in september 2023

Updated On : October 11, 2023 / 11:22 AM IST

Hyderabad Real Estate: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఒకటి హైదరాబాద్‌. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక విదేశాల నుంచి భారీ పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధికల్పన.. విస్తరిస్తున్న ఐటీ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ విక్రయాల్లోనూ హైదరాబాద్‌ ముందంజలో ఉంది. తాజాగా ఇదే విషయాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తన తాజా రిపోర్ట్‌లో తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు గత ఏడాది కంటే 36 శాతం పెరిగాయని వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 88 వేల 230 యూనిట్లు ఉండగా.. ఇప్పుడు రికార్డు స్థాయిలో లక్షా 20 వేల 280 యూనిట్లుగా విక్రయాలు నమోదయ్యాయి.

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడు నగరాల్లో గృహాల సగటు ధరలు ఏటా 11 శాతం పెరిగాయి. హైదరాబాద్‌ విషయానికి వస్తే జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరల సగటు పెరుగుదల 18 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో త్రైమాసిక విక్రయాలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయని తమ రిపోర్ట్‌లో తెలిపింది అనరాక్‌. నివాస గృహాల విషయానికొస్తే అమ్మకాలు 41 శాతం పెరిగాయి. గత యేడాది హైదరాబాద్‌లో 11 వేల 650 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది విక్రయాలు 16 వేల 375 యూనిట్లకు ఎగబాకాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 6 శాతం వృద్ధితో 15 వేల 865 యూనిట్లుగా నమోదయ్యాయి. ముంబైలో ఇళ్ల అమ్మకాలు 26 వేల 400 యూనిట్ల నుంచి 38 వేల 500 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో 2 9శాతం వృద్ధితో 16 వేల 395 యూనిట్లకు చేరాయి. పూణేలో ఇళ్ల అమ్మకాలు గరిష్టంగా 63 శాతం పెరిగాయి. చెన్నైలో ఇళ్ల విక్రయాలు 42 శాతం వృద్ధితో 4 వేల 940 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతాలో ఇళ్ల అమ్మకాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జోరు కొనసాగుతుందని అనరాక్ అంచనా వేస్తోంది.

Also Read: అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనాలి.. మిడిల్ అయితే బెటరా?