Rahul Bajaj : ప్రముఖ భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

పద్మ భూషన్ అవార్డు గ్రహీత, భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, ప్రముఖ బజాజ్ ఆటో సంస్థ (Bajaj auto) మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ (Bajaj Rahul) కన్నుమూశారు.

Rahul Bajaj : ప్రముఖ భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

Industrialist Rahul Bajaj,

Updated On : February 12, 2022 / 5:56 PM IST

Industrialist Rahul Bajaj : అత్యున్నత  పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, ప్రముఖ బజాజ్ ఆటో సంస్థ (Bajaj auto) మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ (Bajaj Rahul) కన్నుమూశారు. బజాజ్ ఆటోమాజీ ఛైర్మన్ గా సేవలు అందించిన 83 ఏళ్ల రాహుల్ బజాజ్ పుణెలో శనివారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించనట్టు బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. గతకొంతకాలంగా రాహుల్ బజాజ్‌కు న్యుమోనియా, గుండె సమస్యతో బాధపడుతున్నారు. గత నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో రాహుల్ బజాజ్ కన్నుమూశారు.

రాహుల్ సారథ్యంలో అగ్రస్థానంలోకి బజాజ్.. 
జూన్ 10, 1938న జన్మించిన రాహుల్ బజాజ్.. ఎకనామిక్స్, లాలో డిగ్రీ చేసిన ఆయన హోవార్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో పట్టా పొందారు. బజాజ్ గ్రూప్‌కు 40 ఏళ్లకు పైగా ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాహుల్ బజాజ్ గత ఏడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సంస్థ ఎమిరిటస్ ఛైర్మన్‌గా ఉన్నారు. రాహుల్ బజాజ్‌కు 2001లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది. రాహుల్ బజాజ్ 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

ఫిబ్రవరి 2021 ప్రకారం.. రాహుల్ బజాజ్ 8.2 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 421వ స్థానంలో నిలిచారు. మార్కెట్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ‘హమారా బజాజ్’, ‘యూ కెనాట్ బీట్ బజాజ్’ లాంటి ట్యాగ్ లైన్లు ఆయన నేతృత్వంలోని దిగ్గజ టూవీలర్ కంపెనీలే ఉన్నాయి. రాహుల్ బజాజ్ 1972లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో రాహుల్ బజాజ్ ఒకరిగా నిలిచారు. టూ వీలర్స్, త్రీ వీలర్స్ రంగంలో బజాజ్ ఆటో సంస్థ రాహుల్ బజాజ్ సారథ్యంలో టాప్ ప్లేసులోకి దూసుకెళ్లింది.

రాహుల్ బజాజ్‌‌కు ప్రముఖుల నివాళులు..
ఆదివారం రాహుల్ బజాజ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రాహుల్ బజాజ్ మృతిపట్ల పలువురు ప్రముఖ వ్యాపార, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాహుల్ బజాజ్‌కు నివాళులర్పించారు.. విజయవంతమైన వ్యవస్థాపకుడు, పరోపకారి, బజాజ్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కు నా హృదయపూర్వక నివాళులు. ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రాహుల్ బజాజ్ మరణ వార్త చాలా విచారకరం.. ఆయన ఆర్థిక రంగంలో దేశ పురోగతికి ఎంతో కృషి చేశారు. ‘బులంద్ భారత్ కీ బులంద్ ఆవాజ్’ భాగమైంది. ప్రతి ఇంటికీ.. అలాంటి గొప్ప వ్యక్తికి నా హృదయపూర్వక నివాళులు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు.


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాహుల్ బజాబ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. బజాజ్ గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ రాహుల్ బజాజ్ మరణం భారతదేశ వ్యాపార వర్గానికి తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు. బజాజ్ కుటుంబ సభ్యులకు, ఆయన బృందానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని చౌహాన్ తెలిపారు.


Read Also : iPhone 12 mini Sale : ఐఫోన్ 12 మినీపై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌‍‌కార్ట్‌లోనే.. ఎంతంటే?